12వ పీఆర్‌సీ వెంటనే నియమించాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వెంటనే 12వ పీఆర్‌సీ నియమించాలని ఎస్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.సాయి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్‌టీయూ భవన్‌లో ఎస్‌టీయూ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, 11వ పీఆర్‌సీ కాలపరిమితి ముగిసి 27 నెలలు కావస్తున్నా 12వ పీఆర్‌సీ నియామకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇంకా నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉంచడం సరికాదని, తక్షణం వాటిని విడుదల చేయాలని, 11వ పీఆర్‌సీ బకాయిలతో పాటు పీఎఫ్ లోన్ బకాయిలు చెల్లించడానికి రోడ్ మ్యాప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి శివప్రసాద్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ పనులు తగ్గించాలని కోరారు. విద్యాశక్తి పేరుతో పాఠశాలల పని వేళలు పెంచడం సరికాదన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు వీసీ జాకబ్, ఎస్‌ఎస్ పళ్లంరాజు, మోర్త శ్రీనివాస్, కాశీ విశ్వనాథ్, ఎస్‌టీయూ ప్రతినిధులు పాల్గొన్నారు.


