అలుపెరగని బోధకునికి అభినందన
ఒక్క సెలవూ పెట్టని
ఉపాధ్యాయినికి డీఈఓ సత్కారం
అయినవిల్లి: మండలంలోని ముక్తేశ్వరం మండల ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు కుడుపూడి నాగేశ్వరరావును జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వరరావు అభినందించారు. పాఠశాల పర్యవేక్షణకు బుధవారం వచ్చిన డీఈఓ సదరు ఉపాధ్యాయుడు కుడుపూడి నాగేశ్వరరావు ఐదేళ్లుగా ఒక సెలవు తీసుకోకపోవడాన్ని తెలుసుకుని అభినందించారు. డీఈఓ మాట్లాడుతూ వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధతలతో పనిచేసే ఉపాధ్యాయుల్లో నాగేశ్వరరావు ఒకరన్నారు. ఇలాంటి ఉపాధ్యాయుల వల్లే ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల సమాజంలో గౌరవం ఉందన్నారు. అనంతరం నాగేశ్వరరావును దుశ్శాలువాతో సత్కరించి, పూల మొక్కను బహూకరించారు. ఆయన వెంట డీసీసీబీ కార్యదర్శి బి హనుమంతరావు, ఎంఈఓ మెల్లం శ్రీనివాసరావు, పెచ్చెట్టి శ్రీనివాసు తదితరులు ఉన్నారు.


