వన విహారికో విడిది..
● పర్యాటకుల కోసం ప్రత్యేక హట్‌లు
● ఆధునిక వసతులతో నిర్మాణం
● సర్వాంగ సుందరంగా వసతి గృహాలు
తాళ్లరేవు: తూర్పున ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన కోరంగి అభయారణ్యాన్ని సందర్శించే పర్యాటకుల కోసం అటవీ శాఖ ప్రత్యేక హట్‌లను (వసతి గృహాలు) అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలో పశ్చిమ బెంగాల్‌లోని సుందరబన్ అడవుల తరువాత రెండో అతిపెద్ద మడ అటవీ ప్రాంతమైన కోరంగి అభయారణ్యాన్ని వేలాది పర్యాటకులు సందర్శిస్తుంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు విడిది చేసేందుకు అటు కాకినాడ కానీ, ఇటు యానాం, అమలాపురం కానీ వెళ్లవలసి వచ్చేది. అయితే కోరంగిలోనే పర్యాటకులు సేద తీరడంతో పాటు అక్కడ బస చేసేలా అత్యాధునిక సౌకర్యాలతో అటవీ శాఖ వసతి గృహాలను ప్రారంభించింది. కోరంగి పంచాయతీలోని ఫారెస్ట్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న మూడు హట్‌లతో పాటు మరొక అటవీ శాఖ భవనాన్ని సైతం పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి రూములోనూ డబుల్ కాట్ బెడ్, ఏసీ, టీవీ, ఇన్వర్టర్ సౌకర్యాలను కల్పించారు. పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తిస్థాయిలో రక్షణ ఉండేలా చర్యలు చేపట్టారు. అంతే కాకుండా ప్రాంగణంలో ఉన్న బయో డైవర్సటీ భవనాన్ని సందర్శిస్తే కోరంగి మడ అభయారణ్యం విశేషాలను తెలుసుకోవచ్చు. ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారికి ఈ హట్‌లు ఒక వరంగా చెప్పవచ్చు.
అందుబాటు ధరలలోనే అద్దెలు..
అటవీశాఖ ఏర్పాటు చేసిన ఈ హట్‌లలో ఒక రోజు బస చేసేందకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఫారెస్ట్ కాంప్లెక్స్‌లో ఉన్న అటవీ శాఖ అధికారులను సంప్రదిస్తే ఈ రూములను కేటాయిస్తారు. పిల్లా, పాపలు, కుటుంబ సభ్యులతో అధిక సంఖ్యలో వచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం ఒకప్పటి ఫారెస్ట్ బంగ్లాను వీఐపీ రూముగా సాధారణ పర్యాటకులకు సైతం అద్దెకు ఇవ్వనున్నారు. ఈ బంగ్లాకు రోజుకు రూ.3,000 చార్జి చేస్తారు. కోరంగి మడ అటవీ ప్రాంతాన్ని సందర్శించి ఒకరోజు ప్రకృతి ఒడిలో సేదతీరడం మరపురాని అనుభూతినిస్తుందని చెపుతున్నారు.
కోరంగిలో సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన పర్యాటక హట్‌లు
కోరంగి ఫారెస్ట్ కాంప్లెక్స్ హట్‌లలో ఏసీ, టీవీ తదితర సౌకర్యాలు
ఆన్‌లైన్‌లో సైతం బుకింగ్
కోరంగి ఫారెస్ట్ కాంప్లెక్స్ ప్రాంగణంలో పర్యాటకుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన హట్‌లను ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకునే సౌకర్యాన్ని అటవీశాఖ కల్పించింది. నేరుగా వచ్చిన పర్యాటకులకు తమ సిబ్బంది ద్వారా గదులను కేటాయిస్తున్నాం. అలాగే ఏపీ టూరిజం వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వీలు కల్పించాం. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను సందర్శించి అక్కడ బస చేయాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం. ఇతర వివరాల కోసం 89859 52875 నెంబరులో సంప్రదించగలరు.
– ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కోరంగి అభయారణ్యం
వన విహారికో విడిది..
వన విహారికో విడిది..


