పోలీసుల అదుపులో పాత నేరస్తుడు
కాకినాడ క్రైం: స్థానిక గంజాం వారి వీధిలో ఉన్న అన్నపూర్ణ మార్కెటింగ్ దుకాణంలో రూ.19 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. క్రైం సీఐ కృష్ణ, కాకినాడ వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు బృందాలు నిందితుడిని పట్టుకున్నాయి. సంబంధిత వివరాలను ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ బుధవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు, కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన పాత నేరస్తుడు కాకర్ల లోవరాజుపై 19 కేసులు ఉన్నాయి. పోలీసు రికార్డుల్లో ఉండడంతో పట్టుబడతానన్న భయంతో తన బంధువైన నగరానికి చెందిన 14 ఏళ్ల బాలుడిని చేరదీసి దొంగతనాలు చేయడం, గంజాయి విక్రయించడం నేర్పాడు. ఈ నేపథ్యంలో చేసిన దొంగతనం దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీలు, సాంకేతికత ఉపయోగించి బుధవారం బుడంపేటలో నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.19 లక్షల నగదుతో పాటు రూ.55 వేల విలువైన 22 కిలోల గంజాయిని పట్టుకున్నామని అన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్పీ పాటిల్, ఎస్‌బీ డీఎస్పీ కేవీవీ సత్యనాయణ, సీఐలు కృష్ణ, నాగదుర్గారావు, ఎస్‌ఐలు వినయ్ ప్రతాప్, స్వామినాయుడు ఎస్‌పి బిందుమాధవ్ అభినందించారు.
అన్నపూర్ణ మార్కెటింగ్
దుకాణంలో చోరీ అతడి పనే
14 ఏళ్ల బాలుడితో కలిపి చోరీలు
రూ.19 లక్షల నగదు..
55 కిలోల గంజాయి స్వాధీనం


