ప్రలోభాలతో పరమాత్ముని వశం చేసుకోలేము
సమన్వయ సరస్వతి సామవేదం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): పాండవుల పక్షాన ద్యూతగా వస్తున్న కృష్ణపరమాత్మకు రత్నాలు, వాహనాలు, ఇతర సంపదలు ఏమడినా ఇవ్వాలని ధృతరాష్ట్రుడు విదురుని ఆదేశిస్తాడు. దానికి సమాధానంగా విదురుడు ప్రలోభాలతో పరమాత్మను వశం చేసుకోలేమని ధృతరాష్ట్రునికి వివరించినట్టు సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన కృష్ణరాయబారం ఇతివృత్తాన్ని వివరించారు. నీవు ఇచ్చే పూర్ణకలశంతోనో, పాదోదకంతోనే, కుశల ప్రశ్నలతోనో తప్పించి కృష్ణుడు ఇతర సంపదలవైపు కన్నెత్తి కూడా చూడడని విదురుడు చెబుతాడు. దుర్యోధనుడు కృష్ణునితో నీ కోసం ఏర్పాటు చేసిన అన్నపానీయాలను, శయ్యను అంగీకరించమని కోరతాడు. కృష్ణుడు దుర్యోధనుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ పాండవులను ద్వేషించిన వాడు నన్ను ద్వేషించినట్టే, వారిని ఆదరిస్తే నన్ను సత్కరించినట్టేనని చెబుతాడు. భగవంతునికీ, భాగవతులకీ తేడా లేదని ఆయన మాటల నుంచి మనం గ్రహించాలని సామవేదం అన్నారు. బాల్యం నుంచి వారి పట్ల దుర్భావంతో ఉన్న నీవు పెట్టే అన్నం కలుషితమైనదని చెప్పి, విదురిని ఇంటికి వెడతాడు శ్రీకృష్ణుడు. దుర్యోధనుడు మూఢుడు, వాడి పట్ల నీవు చెప్పే మంచి మాటలు వ్యర్థం అవుతాయని విదురుడు కృష్ణునితో చెబుతాడు. ఇరుపక్షాల వారికీ నేను కావలసినవాడిని, జ్ఞాతుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడితే సరిద్దిడానికి ప్రయత్నించకపోతే, లోకం నన్ను నిందిస్తుంది. నేను నిష్కపటంగా సంధి కోసం ప్రయత్నిస్తానని చెప్పాడు కృష్ణుడు. విదురుడు ప్రీతితో పెట్టిన అన్నాన్ని స్వీకరిస్తాడు. అనంతరం కృష్ణుడు కుంతిని కలసి పాండవుల క్షేమవార్తను తెలియచేస్తాడు. క్షత్రియకాంత ఏ ప్రయోజనాన్ని ఆశించి సంతానాన్ని కంటుందో, ఆ ప్రయోజనం నెరవేర్చే సమయం ఆసన్నమయిందని ధర్మరాజుకు చెప్పమని కుంతి కృష్ణుని కోరుతుంది. అనేక మంది మహర్షులు, రాజర్షులు, దేవర్షులు కృష్ణుని సందేశం వినడానికి సభకు వస్తారు. ముందుగా వారికి ఆసనాలు ఏర్పాటు చేయండి, వారు కూర్చోకుండా మనం ఆసీనులం కారాదని కృష్ణుడు సూచిస్తాడని సామవేదం అన్నారు.


