రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి
అమలాపురం రూరల్: రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, ప్రజల సంకల్పాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ, పీడీఎస్‌యూ, ఏఐకేఎంఎస్, ఐఎఫ్‌టీయూ ప్రజా సంఘాలు శనివారం అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. సీపీఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కోకన్వీనర్, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐకేఎంఎస్ నాయకుడు వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్‌కుమార్, బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అభివృద్ధి ముసుగులో జిల్లాల పునర్విభజన చేయడంతో ప్రజల మధ్య అనేక చీలికలు, అయోమయం, పరిపాలనా సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. భౌగోళికంగా, చారిత్రకంగా, పరిపాలనా పరంగా శతాబ్దాలుగా కాకినాడ జిల్లాతో అనుసంధానమైన రామచంద్రపురం నియోజకవర్గాన్ని, గోదావరి నదిని దాటి వెళ్లాల్సిన దూర ప్రాంతంతో అనుసంధానం చేయడం ప్రజలకు మేలు చేసే నిర్ణయం కాదని అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి పదవి అందుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. అఖిలపక్ష జేఏసీ గౌరవ అధ్యక్షుడు దొమ్మలపాటి సత్యనారాయణ, ఐఎఫ్‌టీయూ నాయకులు చింతా రాజారెడ్డి, నాయకులు నాగరాజు, అలీ, కె.నవీన్, బుల్లి రాజు, పట్టాభి, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.


