ఉపాధికి వెళ్లి గుండెపోటుతో మృతి
అమలాపురం రూరల్: అమలాపురం మండలం వన్నెచింతలపూడికి చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం దేశం కాని దేశం వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. కేసీఎం అధికారుల చొరవతో అతని మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. వన్నెచింతలపూడి గ్రామానికి చెందిన ముంగండ రవితేజ (33) ఉపాధి నిమిత్తం ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఖతార్ దేశానికి వెళ్లి హౌస్ కేరింగ్ వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ నెల 16న రాత్రి అక్కడ గుండెపోటుతో మరణించాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల 17న కలెక్టర్ మహేష్ కుమార్‌ను సంప్రదించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్, సిబ్బంది ఎంఎం సఫియా, కడియాల సత్తిబాబు, బద్రి దుర్గా అమ్మాజీలు బాధిత కుటుంబాన్ని కలుసుకుని వివరాలు సేకరించారు. అనంతరం భారత రాయబార కార్యాలయంతో పాటు ఖతార్‌లోని ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్‌కుమార్, విజయ్ చార్లీ, సోలామాన్, రమణ, శశిలతో నిరంతరం సమన్వయం జరిపారు. అనంతరం మృతదేహాన్ని వన్నెచింతలపూడికి శనివారం చేర్చారు.
వ్యక్తి ఆత్మహత్య
సామర్లకోట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సామర్లకోట సీఐ ఎ.కృష్ణభగవాన్ కథనం ప్రకారం.. స్థానిక గాంధీనగర్‌కు చెందిన సిరికి రవికుమార్ (49) లారీ స్టాండ్ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ఆర్థిక ఇబ్బందులు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో సమాచారం మేరకు సీఐ కృష్ణభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


