రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు
సామర్లకోట: గొంచాల–అచ్చంపేట రోడ్డులో జరిగిన ప్రమాదంలో పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. నక్కపల్లి యూనియన్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న సందీప్‌రాజు కారు అతి వేగంగా రావడంతో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరర చదువుతున్న బెహరా రాజు తీవ్రంగా గాయపడ్డాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తాను ఏమి చేయలేనని సందీప్‌రాజు చెప్పడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దాంతో సీఐ ఎ.కృష్ణభగవాన్ శనివారం రాత్రి ఇరువర్గాలను పిలిచి చర్చలు జరిపారు. బాధితుడి కాలు పూర్తిగా తీసి వేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని, నష్ట పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దానికి కారు యజమానికి చెందిన బంధువులు అంగీకరించక పోవడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సీఐ సూచించారు. అయితే రాత్రి వరకూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.


