రాతనాల్లా మార్చుకుందామా..
ఫ మంచి దస్తూరితో భవితకు బాట
ఫ పదో తరగతిలో
మంచి మార్కులకు దోహదం
ఫ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న
ఉపాధ్యాయులు
రాయవరం/ ప్రత్తిపాడు: మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు.. కానీ అందుకు తగ్గట్టుగా మార్కులు రావడం లేదు.. మా అమ్మాయి లెక్కలు బాగా చేస్తోంది. సూత్రాలు, ఫార్ములాలు మాత్రం ఎందుకో తప్పుగా కనిపిస్తుంటాయని ఉపాధ్యాయులు తరచూ చెప్పే మాటలివి.. ఇందుకు కారణం చేతిరాతే. ‘రాత బాగుంటే గీత బాగుంటుంది’ అన్న నానుడి పరీక్ష రాసే విద్యార్థికి ‘అక్షరాలా’ సరిపోతుంది. మంచి దస్తూరి ఉంటే మూల్యాంకనం సమయంలో సమాధాన పత్రాలు దిద్దే ఉపాధ్యాయుడికి మంచి భావన కలుగుతుంది. ఆ ప్రభావం మార్కులపై ఉంటుంది. అందుకే పరీక్షల్లో తెలివితో పాటు అక్షరాలు కూడా ఆయుధాలుగా పనిచేస్తాయని ఉపాధ్యాయులు చెబుతారు.
ఇవి పాటిస్తే మంచిది
ఫ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమ వైపు అంగుళం మార్జిన్ విడిచి పెట్టాలి.
ఫ సమాధాన పత్రంలో రాసే జవాబు సూటిగా ఉండటంతో పాటు అక్షరాలు పొందికగా రాయాలి.
ఫ అక్షరాలు వంకర టింకరగా, గజిబిజిగా ఉంటే మార్కులు తగ్గినట్టే.
ఫ పేజీకి 16 నుంచి 20 లైన్లకు మించకుండా రాయాలి.
ఫ సమాధానాలు రాసే సమయంలో ప్యాడ్‌పైకి వాలిపోకుండా సాధ్యమైనంత వరకూ కూర్చుని రాయాలి.
ఫ రెండు పదాల మధ్య ఒక అక్షరం లేదా ‘0’ పట్టేంత ఖాళీ స్థలం ఉండాలి. రెండు వరుసల మధ్య అర అంగుళం దూరం వదలాలి.
ఫ కంటికి పేపరుకు 30–35 సెంటీమీటర్ల దూరం ఉండాలి.
ఫ అక్షరాలన్నీ ఒకే సైజులో, ఒకే లైనులో ఉంటేనే రాత అందంగా వస్తుంది. ముందుగా ఫోర్ రూల్, తర్వాత డబుల్ రూల్, అనంతరం సింగిల్ రూల్‌పై ప్రాక్టీస్ చేయాలి.
ఫ ఇంగ్లిష్‌లో కర్సివ్, లుసిడా రైటింగ్‌ను ప్రాక్టీస్ చేయాలి. వరుస క్రమంలో కనీసం పది రోజులు తర్ఫీదు తీసుకోవాలి.
ఫ మొదటగా లెటరింగ్, తర్వాత వర్డింగ్, అనంతరం సెంటెన్సెస్ రాయడం నేర్చుకోవాలి.
ఫ గొలుసుకట్టు రాత ఉండకూడదు. ప్రతి అక్షరం ఒకే పరిమాణంలో రాయాలి.
ఫ పెన్నును మామూలుగా పట్టుకోవాలి. బిగుసుగా పట్టుకుంటే వేగంగా రాయలేం. అక్షరాల స్పష్టతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఫ ప్రాథమిక స్థాయి నుంచే మంచి రాత అలవాటు చేసుకోవాలి. తెల్ల కాగితంపై వరుస తప్పకుండా రాయగలగాలి.
సాధనతోనే సాధ్యం
ప్రతి విద్యార్థికి తెలివి తేటలకు తోడు, సమయ పాలనకు, సహనానికి దస్తూరి ఓ సూచికగా చెప్పవచ్చు. అందుకే మంచి దస్తూరి ఉన్న విద్యార్థులే దాదాపు టాపర్లుగా నిలుస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి దిద్దుబాట్లు, కొట్టివేతలు లేకుండా రెండున్నర గంటల్లో స్పష్టంగా పరీక్ష రాయాలి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి చేతిరాతపై పడింది. ఇందుకు తగిన తర్ఫీదును ఉపాధ్యాయులు ఇస్తూ సాధన చేయిస్తున్నారు. పరీక్ష నెమ్మదిగా రాస్తే సమయం సరిపోదు. వేగంగా రాసేటప్పుడు తప్పులు దొర్లకుండా చూసుకోవాలి.ఇలా చేయాలంటే ముందుగా ప్రత్యేక తరగతులు, స్లిప్, గ్రాండ్ టెస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
ముత్యాల్లాంటి అక్షరాలు మంచి మార్కులు తెచ్చిపెడతాయి.. విద్యార్థి భవితకు బాటలు వేస్తాయి.. సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళిక ప్రకారం అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించడంతో పాటు, మంచి దస్తూరితో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.. మనం ఏం రాశామన్నది పేపర్లు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు అర్థం అయ్యేట్టు ఉంటేనే ఎక్కువ మార్కులు వస్తాయి.. దీనికోసం మంచి దస్తూరిపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే పదో తరగతి పరీక్షల్లో ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.
రాతనాల్లా మార్చుకుందామా..


