బాలా.. భళా
ఫ ఆంగ్లంలో 20వ ఎక్కం వరకూ
చెబుతున్న ఒకటో తరగతి విద్యార్థి
ఫ చిరుప్రాయంలోనే ప్రతిభ
కొత్తపేట: ఒకటో తరగతి బాలుడు.. ఎక్కాలు ఆంగ్లంలో గణగణా చెప్పేస్తున్నాడు.. ఆ చిన్నారి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటున్నాడని అనుకుంటున్నారా? కాదు.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలుడే.. అతని జ్ఞాపకశక్తి అమోఘమని అందరూ ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్ మేధావి అని ఆకాంక్షిస్తున్నారు.. ఈ బాలుడి పేరు అడపా మోహన్‌సాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.దుర్గాప్రసాద్ ఎక్కాలు సులభ రీతిలో ఆంగ్లంలో చదవడంపై శిక్షణ ఇచ్చారు. దాని ఫలితంగా మోహన్‌సాయి అందరి కంటే మించి ఒకటో ఎక్కం నుంచి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు అనర్గళంగా చూడకుండా చెప్పేస్తున్నాడు. ఎంఈఓ మట్టపర్తి హరిప్రసాద్ ఆ పాఠశాల సందర్శన సందర్భంగా ఏ ఎక్కం గురించి అడిగినా భయం లేకుండా, తడుముకోకుండా అప్పచెప్పేశాడు. బాలుడి మేథస్సుకు ముచ్చటపడి ఆయన అభినందించారు. నేటి బాల మేథావి అని ఆకాంక్షించారు. ఇదిలాఉంటే అతని తల్లిదండ్రులు పెద్ద చదువులు చదివిన విద్యాధికులు కాదు.. తండ్రి శ్రీనివాసరావు సాధారణ రైతు కాగా, తల్లి గృహిణి. అతని అన్న రెండో తరగతి చదువుతున్నాడు.
జ్ఞాపకశక్తి అమోఘం
చిరుప్రాయంలోనే ఇంత మేథస్సు గల మోహన్‌సాయి గురించి ఉపాధ్యాయుడు దుర్గాప్రసాద్‌ను ‘సాక్షి’ అడగ్గా, ఆయన ఇలా తెలిపారు. ఒకటో తరగతి బాలలు రెండు పదులు, మూడు పదులు వరకూ చెప్తారు. కానీ సాయి 20వ ఎక్కం వరకూ 20 స్టెప్పులు ఆంగ్లంలో ధారాళంగా చూడకుండా చెబుతున్నాడు. ఇతని జ్ఞాపకశక్తి అద్భుతం, అమోఘమని అన్నారు. తన 40 ఏళ్ల సర్వీసులో ఒకటో తరగతి విద్యార్థి ఇలా చెప్పడం చూడలేదని చెప్పారు.
గత ప్రభుత్వ కృషికి ఫలితం
మోహన్‌సాయి అనర్గళంగా ఆంగ్లంలో 20 ఎక్కాలు చెప్పడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియం ఓ కారణంగా చెప్పవచ్చు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలే పునాది అయ్యింది. ‘మనబడి నాడు – నేడు’ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పించిన విషయం తెలిసిందే. ఇంగ్లిషు మీడియం ఆప్షన్ అమలు చేయడంతో ఈ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులు ఈ మీడియం పట్ల మక్కువ చూపారు. మాతృభాష తెలుగుతో పాటు దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు దోహదపడే ఇంగ్లిషును కూడా మాట్లాడగలుగుతున్నారు. నాడు జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలే నేటి ఈ మార్పులకు పునాది అని పలువురు విద్యాధికులు, మేధావులు పేర్కొంటున్నారు.
బాలా.. భళా


