కాకినాడ టు శబరిమల
ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్ర
నగరి: సాధారణంగా అయ్యప్ప భక్తులు పంబ నుంచి, లేకుంటే ఎరిమేలి నుంచి పెద్ద పాదలో గానీ పాదయాత్రగా శబరి కొండపైకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం పరిపాటి. అయితే కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఇద్దరు భక్తులు 1,470 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అయ్యప్ప దర్శనానికి వెళ్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా, తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన అర్జున్ (63), కాకినాడ రూరల్ రేపూరు గ్రామానికి చెందిన ముమ్మిడి భవానిశంకర్ (44) అయ్యప్ప స్వామి మాల ధరించారు. 18 ఏళ్ల క్రితం అర్జున్ స్వామి తన 18వ శబరియాత్రను చేపట్టగా, ముమ్మిడి భవాని శంకర్ కన్నెస్వామిగా మాల ధరించి ఆయన వెంట కాకినాడ నుంచి శబరికొండ వరకు పాదయాత్రగా వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఆపై ఇరువురు సొంతంగా అయ్యప్ప ఆలయాలను నిర్మించి కలసి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఇద్దరూ పాదయాత్ర చేసినా కలసి వెళ్లలేదు. మరో 18 ఏళ్లకు వారి ఆశయం నెరవేరింది. ఇద్దరూ వారి ప్రాంతాల్లో నూతన అయ్యప్ప ఆలయాల నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఏడాది కలసి పాదయాత్ర ప్రారంభించారు. భవానీ శంకర్ 18వ సారి శబరి యాత్ర చేస్తుండగా, అర్జున్ స్వామి 36వ సారి తన యాత్రను కొనసాగిస్తున్నారు. వారు శుక్రవారం చిత్తూరు జిల్లా నగరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ యాత్ర వివరాలను మీడియాకు తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోరుతూ ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగిస్తున్నామన్నారు. భవానీ శంకర్ నవంబరు 30న రేపూరు నుంచి యాత్రను ప్రారంభించగా, అర్జున్ స్వామి డిసెంబరు 4వ తేదీ తణుకు నుంచి యాత్రను ప్రారంభించారు. 22 రోజులుగా కలసి యాత్ర కొనసాగిస్తున్నామని మకర జ్యోతికి శబరిమలకు చేరుకుంటామని వారు తెలిపారు.
వేల కిలోమీటర్ల యాత్రలో..
శబరి కొండకు వీరు చేసే యాత్రలు విని అందరూ నోరెళ్లబెడుతున్నారు. వీరిలో అర్జున్ స్వామి ఏడుసార్లు ఇలా తణుకు నుంచి శబరి కొండకు ఇరుముడితో పాదయాత్ర చేశారు. ఇందులో నాయుడుపేట మీదుగా మూడు సార్లు, సేలం, దిండిగల్ మీదుగా రెండు సార్లు, తిరుత్తణి, అరకోణం మీదుగా రెండు సార్లు పాదయాత్రగా వెళ్లగా, మోటారుసైకిల్ మీదుగా మూడుసార్లు, సైకిల్‌పై ఐదుసార్లు యాత్ర కొనసాగించారు. ప్రస్తుతం 62 సంవత్సరాల వయస్సులో ఇరుముడి ధరించి పాదయాత్ర చేస్తున్న ఈయన భక్తికి పరవశించి అందరూ ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. గణపతి గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నానని ఆయన తెలిపారు. ముమ్మిడి భవానీశంకర్ నాలుగు సార్లు పాదయాత్రగా వెళ్లగా, ఒకసారి బైక్‌యాత్ర చేశారు. ప్రస్తుతం ఐదవసారి యాత్ర చేస్తున్నారు. వేలు గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నాని ఆయన తెలిపారు. పెట్రోలు బంకులు, ఆశ్రమాలు, గుళ్ల వద్ద తలదాచుకుంటూ మార్గంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నారు.


