ఎగ్‌నామం పెట్టేందుకా?
బాలాజీచెరువు (కాకినాడ): మధ్యాహ్న భోజన పథకం అపహాస్యం అవుతోంది.. సంబంధిత ప్రైవేట్ ఏజెన్సీలు మధ్యాహ్న భోజనంలో మెనూలో భాగంగా ఉడకబెట్టిన గుడ్లను నిర్వాహకులకు పంపిస్తుండగా, ఇందులో రోజుకు 10 నుంచి 20 వరకూ పాడైపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పాడైన గుడ్లు వచ్చాయి. వాటిని వారు తినకుండా వదిలేశారు. ఇక్కడ మొత్తం 240 మంది మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇందులో రోజూ సుమారు పది వరకూ గుడ్లు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఈ విషయమై అధికారులకు చెబుతున్నా మార్పు ఉండటం లేదని పలువురు వాపోతున్నారు.
స్నేహితుడిపై దాడి: వ్యక్తికి జైలు
కాకినాడ లీగల్: స్నేహితుడిపై దాడి చేసిన వ్యక్తికి 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ నిరూప భంజ్ డియో శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తిమ్మాపురానికి చెందిన కొప్పిశెట్టి రాజేష్ అదే ప్రాంతానికి చెందిన జియ్యన శ్రీమన్నారాయణ స్నేహితులు. వారి మధ్య కక్షలు ఉండడంతో శ్రీమన్నారాయణపై రాజేష్ రాయితో దాడి చేశాడు. దీనిపై తిమ్మాపురం పోలీసులు 2022లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో రాజేష్‌పై నేరం రుజువు కావడంతో 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.


