చిన్నారి ప్రాణాలు కాపాడిన జీజీహెచ్ వైద్యులు
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్ వైద్యులు ఒక పసివాడి ప్రాణాలు కాపాడారు. ఆ వివరాల్లోకి వెళితే.. పండా విజయదుర్గ అనే మహిళ మూడు రోజుల నుంచి జీజీహెచ్‌లోని న్యూరో మెడిసిన్ విభాగంలో ఫిట్స్‌తో చికిత్స పొందుతుంది. ఆమెకు ఎనిమిది నెలల కుమారుడు. ఆస్పత్రిలో తల్లితో పాటు ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఆ చిన్నారి ఆడుకుంటూ అక్కడే ఉన్న మెంథోప్లస్ బామ్ డబ్బా ప్రమాదవశాత్తూ మింగేశాడు. డబ్బా బయటకు రాక ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం గుర్తించిన తల్లి విజయదుర్గ తోటి రోగుల సహాయంతో బాలుడిని కింద అంతస్తులోని అత్యవసర విభాగంలో చేర్చింది. అప్పటికే బాలుడి నోటి నుంచి రక్తం కారడం మొదలైంది. తక్షణమే స్పందించిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుష్మ, సహ వైద్యులు సత్యవాణి, మాణిక్యం, కాంతిమ సహకారంతో అరగంట పాటు శ్రమించి బాలుడి గొంతు నుంచి మెంథోప్లస్ బామ్ డబ్బాను బయటకు తీసి ప్రాణాలు నిలిపారు. వైద్యుల కృషిని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి అభినందించడంతో పాటు బాలుడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
చిన్నారి ప్రాణాలు కాపాడిన జీజీహెచ్ వైద్యులు


