కల్తీ పెట్రోలు విక్రయంపై ఆందోళన
జగ్గంపేట: కాట్రావులపల్లి గ్రామంలోని శ్రీజయలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్‌లో కల్తీ పెట్రోల్ కొడుతున్నారంటూ వినియోగదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఆర్‌ఎస్‌ఎస్ సత్యనారాయణ రాజు పరిశీలించి తేడాలు గుర్తించి బంక్‌ను సీజ్ చేశారు. ఆ వివరాల ప్రకారం.. కాట్రావులపల్లిలో ఆ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోలు కొట్టించుకున్న మోటార్ సైకిళ్లు కొద్దిరోజులుగా మరమ్మతులకు గురవుతున్నాయి. ఒక్కసారిగా చాలా మోటారు సైకిళ్లు పాడవడంతో మెకానిక్‌లు పెట్రోల్‌లో తేడా వల్లే ఇలా జరిగిందని వివరించడంతో సుమారు 28 మంది వాహనదారులు పెట్రోల్ బంక్ వద్ద సాయంత్రం ఆందోళనకు దిగారు. తమ వాహనాల మరమ్మతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో యాజమాన్యానికి, వినియోగదారుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జగ్గంపేట ఎస్సై రఘునాధరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట ఎంఎస్‌ఓ కృష్ణ సమాచారంతో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి సత్యనారాయణ రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు, పెట్రోల్ సాంద్రత, నిల్వలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాంద్రతలో చాలా తేడాలు గుర్తించామని చెప్పారు. దీని ప్రకారం కల్తీ జరిగిందని నిర్ధారణకు వచ్చి బంక్ సీజ్ చేశామని, అలాగే యజమాని కనిగిరి వెంకట రమణమూర్తి, గుమస్తా వాకాడ రమేష్‌పై 6ఏ కేసు నమోదు చేశామని తెలిపారు. కాట్రావులపల్లి పెట్రోల్ బంక్‌ను తాత్కాలికంగా జగ్గంపేటలోని ఎస్‌ఆర్ బంక్ అప్పగించామని చెప్పారు. జగ్గంపేట ఎంఎస్‌ఓ కృష్ణ, వీఆర్వో కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.


