భారతం సమగ్ర వేదవాజ్మయం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్) భారతం సమగ్ర వేదవాజ్ఞ్మయమని, విజ్ఞాన సర్వస్వమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాసభారత ప్రవచన యజ్ఞాన్ని స్థానిక హిందూ సమాజంలో ఆయన ఆదివారం కొనసాగించారు. భారతంలోని కథలు, ఉపదేశాలు, ఉపాఖ్యానాలు, పాత్రల మధ్య కానవచ్చే సంవాదాల్లో విస్తారమైన ధర్మబోధ ఉంటుందని చెప్పారు. ధర్మం లేనప్పుడు జ్ఞానం వికసించదన్నారు. ‘భారతంలో ముఖ్యంగా మూడు విచారధారలు కనపడతాయి. జీవవిచారం– నేను ఎవరు అనే ప్రశ్న. ధర్మవిచారం– ఏది ధర్మం అనే ప్రశ్న, బ్రహ్మవిచారం– బ్రహ్మం అంటే ఏమిటి? ఈ మూడు విభాగాలకు సంబంధించిన రహస్యాలకు భారతం పరిష్కారం చూపుతుంది’ అని అన్నారు. ‘బ్రాహ్మణుడంటే ఎవరు అని ధర్మరాజును నహుషుడు అడుగుతాడు. సత్యం, దానం, క్షమ, శీలం, క్రూరత్వం లేకపోవడం, తపస్సు, దయ ఇత్యాది లక్షణాలు కలవాడే బ్రాహ్మణుడని ధర్మరాజు సమాధానం చెబుతాడు’ అని వివరించారు. వేదాలు, పురాణాలతో పాటు భారతంలో అనేక సందర్భాల్లో సరస్వతీ నది ప్రస్తావన కనబడుతుందని, అనేక పరిశోధనలు ఈ ప్రాచీన నది ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. పాశ్చాత్యులు కుట్రలతో ఈ పరిశోధనలను అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దివ్యాస్త్రాలతో తిరిగి వచ్చిన అర్జునుడు తన సోదరులను, ద్రౌపదిని కలుసుకుంటాడు. దివ్యాస్త్రాలను ప్రదర్శన కోసం వినియోగించరాదని, అల్పులపై ప్రయోగించరాదని అతడికి నారదుడు హితోపదేశం చేస్తాడు. అలాగే, క్రోధం పాపహేతువని, దీనిని నియంత్రించుకోవాలని భీముడికి కుబేరుడు చెబుతాడు’ అని సామవేదం చెప్పారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, సౌగంధికా పుష్పాలను తీసుకురావడానికి వెళ్లిన భీముడి ద్వారా మనకు హనుమద్దర్శనం జరిగిందని, ఇక రామ దర్శనమే తరువాయని అన్నారు.


