సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కష్టాల్లో ఉన్న వారికి అండాదండ
కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచిన వైఎస్ జగన్ నేటి రాజకీయాల్లో అరుదైన నాయకుడని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. జగన్ పుట్టిన రోజు వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సిటీ కార్యాలయంలో ద్వారంపూడి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. జగన్నాథపురంలోని పార్టీ కార్యాలయంలో పేదలకు పండ్లు, చీరలు పంపిణీ చేశారు. మహర్షి సాంబమూర్తి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అన్న సమారాధన చేశారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిరంతరం పోరాడుతున్న జగన్‌కు ప్రతి కార్యకర్తా తోడుగా నిలవాలని అన్నారు. ప్రజల కోసమే నిరంతరం పోరాడిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా జగన్‌కు ఉన్న ప్రజాదరణ ఎక్కడా చెక్కు చెదరలేదన్నారు. ఆయన మరోసారి సీఎం కావడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, యువజన, బీసీ విభాగాల జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి బన్నీ, అల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.


