జాతీయ రోలర్ స్కేటింగ్ విజేతలకు అభినందన
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విశాఖలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు అభినందన కార్యక్రమం బుధవారం కాకినాడలోని వైఎస్‌ఆర్ స్కేటింగ్ రింక్‌లో జరిగింది. ఈ పోటీల్లో ఆకుల కావ్యశ్రీ మూడు బంగారు, సత్తి శ్యామ్ సుందర్‌రెడ్డి రజిత, కాంస్య, చీకట్ల అశ్విన్ నిహాల్ రెండు కాంస్య, బిక్కిన శ్రీసాయి మహిత రెండు కాంస్య, కనకట్ల నిహారికి బంగారు, జానగౌరి సుప్రజ కాంస్య, వైట్ల కార్తిక్ శ్రీశౌర్య రెండు కాంస్య పతకాలు సాధించారు. రాజమహేంద్రవరానికి చెందిన కెల్ల భవ్యశ్రీ రెండు బంగారు, ఒక కాంస్య పతకం అందుకుంది. రావులపాలేనికి చెందిన కట్ట శ్రీరామ్ కాంస్య పతకం సాధించాడు. వీరు రోలర్ స్కేటింగ్ కోచ్‌లు ఈశ్వర్, చంటి వద్ద శిక్షణ పొందుతున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రోలర్ స్కేటింగ్ సంఘ అధ్యక్షుడు రావు రాజగోపాల్, కార్యదర్శి దొరైస్వామిలు మెమెంటోలు అందజేసి సత్కరించారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు
అంబాజీపేట: కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి విశాఖపట్నం కిరాయికి వెళ్లి అదృశ్యం కావడంతో కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తొండవరం గ్రామానికి చెందిన వెంపరాల వెంకన్నబాబు గ్రామంలో ఎలక్ట్రికల్, కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 12న బయటకు వెళ్లిన వెంకన్నబాబు తిరిగి ఇంటికి రాలేదు. 13న కారుపై విశాఖపట్నం కిరాయికి వెళుతున్నానని తన కుమారుడు నాగసాయిరామ్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అప్పటి నుంచి రాకపోవడంతో చుట్టుపక్కల వారిని, బంధువులను అడిగినా చేసినా ఫలితం లేకపోవడంతో వెంకన్నబాబు భార్య అరుణశ్రీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సూర్యనారాయణ తెలిపారు.
కళాశాలకు వెళ్లేందుకు
బస్సు ఎక్కి..
కోటనందూరు: ఓ విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ బుధవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పాతకొట్టాం గ్రామానికి చెందిన కాపారపు జయవర్ధన గోపాలకృష్ణ తుని రాజా కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే ఈ నెల 15న కళాశాలకు వెళ్లేందుకు పాతకొట్టాంలో బస్సు ఎక్కాడు. కళాశాలకు చేరుకోకపోవడంతో యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకపోవడంతో విద్యార్థి తల్లి కాపారపు లోవతల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. అతని ఆచూకీ తెలిస్తే 94409 00773 ఫోన్ నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
భార్య కనపడడం
లేదంటూ ఫిర్యాదు
నల్లజర్ల: తన భార్య పుట్టింటికి వెళ్తానని చెప్పి కనిపించకుండా పోయిందని ఓ వ్యక్తి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మండలంలో అనంతపల్లికి చెందిన ఒల్లు అప్పారావు భార్య దివ్యదుర్గ ఈ నెల 8న అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి కనిపించకుండా పోయింది. ఈ మేరకు అప్పారావు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాదరావు తెలిపారు.
జాతీయ రోలర్ స్కేటింగ్ విజేతలకు అభినందన


