
అంతర్జాతీయ సమావేశాలకు నిర్కా డైరెక్టర్ మాగంటి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): స్థానిక ఐసీఏఆర్ – జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ స్వీడన్ స్టాక్‌హోమ్‌లో పొగాకు ఉత్పత్తులపై జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. సెప్టెంబరు 2 నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ అంతర్జాతీయ సమావేశాలలో ఐఎస్‌వో/టీసీ–126లో పాల్గొనే భారత బృందంలో ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ పర్యటన ప్రధానం పొగాకు, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన అంతర్జాతీయ ప్రామాణీకరణ ప్రక్రియలలో భారతదేశం క్రియాశీల పాత్రను బలోపేతం చేయడమే లక్ష్యంగా సాగుతోందని ఆయన తెలిపారు. పొగాకులో పరీక్షా పద్ధతులు, భద్రతా ప్రమాణాలు, నాణ్యతకు సంబంధించి కొత్త అంతర్జాతీయ ప్రమాణాల అభవృద్ధి, సవరణపై ఆయన అభిప్రాయాలను వ్యక్తపరచనున్నారు. పొగాకు ఉత్పత్తుల పరీక్షలకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి శీల సమీక్షలో పాల్గొని, అభివృద్ధి చెందుతున్న భారత జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా కృషి చేయనున్నారు. అదే విధంగా వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రయాణీకరణ సంస్థ సమర్పించే సాంకేతిక నివేదికలు, స్థితిగతుల పత్రాలను సమీక్షించి, భారతదేశం గ్లోబల్ ప్రమాణాల అభివృద్ధిలో మాధవ్ కీలకపాత్ర పోషించనున్నారు. ఈ మేరకు శుక్రవారం స్వీడన్‌కు బయలుదేరనున్న ఆయనను నిర్కా శాస్త్రవేత్తల బృందం పుష్పగుచ్ఛంతో అభినందించింది.