
పాఠశాలలో మత ప్రచారంపై ఆందోళన
● పాఠశాల పైఅంతస్తులో చర్చిని
తొలగించాలని డిమాండ్
● పోలీసుల హామీతో ఆందోళన విరమణ
కపిలేశ్వరపురం: మండలంలోని కోరుమిల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మత ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ గోదావరి గట్టు వంతెన నుంచి గ్రామ వీధుల మీదుగా పంచాయతీ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. విషయం తెలుసుకున్న రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ పరిస్థితిని సమీక్షించారు. సమస్య మూలాలపైనా, గ్రామంలోని శాంతి భద్రతలపైనా ట్రైనీ డీఎస్పీ పి.ప్రదీప్తి, మండపేట రూరల్ సీఐ పి.దొరరాజులతో చర్చించారు. ఆందోళనకు కాకినాడకు చెందిన హైందవ పరిరక్షణ సమితి నాయకులు మద్దతు పలికారు. సమితి నాయకులు సీహెచ్ గవరయ్య, కె.తులసి మాట్లాడుతూ పిల్లలకు విజ్ఞానాన్ని పంచాల్సిన పాఠశాలలో మత ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పాఠశాలపై అంతస్తులో చర్చి నిర్వహించడంపై పంచాయతీ, విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. వెంటనే పాఠశాల నుంచి చర్చిని వేరు చేసే చర్యలు ప్రారంభించాలని లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు మాట్లాడుతూ చర్చి నిర్వహణకు ఉన్న పత్రాలతో వారం రోజుల్లో హాజరుకావాలంటూ నోటీసు జారీ చేస్తానని, ఆ లోగా సమాధానం రానిపక్షం ఉన్నతాధికారులకు సమస్యను నివేదిస్తానని హామీ ఇచ్చారు. దాంతో ఆందోళనకారులు సంతృప్తి చెంది ఆందోళనను విరమించారు. అంగర ఎస్సై హరీష్‌కుమార్ బందోబస్తు నిర్వహించారు.