
బరువులెత్తారు...పతకాలు పట్టారు
● అమలాపురంలో ఉభయ గోదావరి
జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు
● 200 మంది క్రీడాకారుల హాజరు
అమలాపురం టౌన్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో 4వ యునైటెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 200 మంది పవర్ లిఫ్టర్లు హాజరై బరువులెత్తి సత్తా చాటారు. కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు పోటీలను ప్రారంభించారు. అంతకు ముందు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీఎస్ సురేష్‌కుమార్‌ను సత్కరించి క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోటీలు జరిగాయి. సబ్ జూనియర్, మాస్టర్స్ (పురుషులు, మహిళలు) విభాగాల్లో 30 కేటగిరీల్లో పోటీలను నిర్వహించారు. విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు, ఒలింపిక్ పతకాలు, చాంపియన్ షిప్ ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. బెంచ్ ప్రెస్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్‌కు అనుబంధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు ఉత్కంఠగా జరిగాయి. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డి.సత్యనారాయణ, ఎంవీ సముద్రం, వి.నరేష్, డీఆర్‌కే నాగేశ్వరరావు, డి.గణేష్‌బాబు, బి.జోసఫ్, ఎస్‌కే వలీ సాహెబ్ వ్యవహరించారు. జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, అమలాపురం వైస్ ఎంపీపీ అడపా వెంకట సుబ్రహ్మణ్యం, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు కల్వకొలను బాబు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రవణం వేణుగోపాలరావు పాల్గొన్నారు.

బరువులెత్తారు...పతకాలు పట్టారు