
బాగానే బొక్కుతున్నారు!
సముద్ర సంరక్షణికి ప్రాణ సంకటం
అవగాహన లేమితో వేటాడుతున్నమత్స్యకారులు
భారీ జలచరమే అయినా సాధుజీవి
కోస్తా తీరం ప్రత్యుత్పత్తికి అనుకూలం
వాటి సంరక్షణ మనిషి బాధ్యత
నేడు ప్రపంచ బొక్కుసొర దినోత్సవం
తాళ్లరేవు: సముద్ర సంరక్షణిగా పేరుగాంచిన అతిపెద్ద చేప బొక్కు సొర (రింకోడాన్ టైపస్) క్రమక్రమంగా కనుమరుగవుతోంది. సుమారు 65 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఈ చేప అత్యంత శక్తివంతమైన సాధుజీవి. సముద్ర తీరం వెంబడి అభివృద్ధి చెందుతున్న ఏడు సెక్టార్ల కారణంగా ఈ గంభీరమైన చేప అంతరించిపోతుండడం అందరినీ కలవరపెడుతోంది. దీని పరిరక్షణకు భారత ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలలో విస్తరించి ఉన్న ఈ చేపను కాపాడడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమైన నేపథ్యంలో ఏటా ఆగస్టు 30వ తేదీన బొక్కుసొర దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఎక్కువ మందమైన చర్మం కలిగిన ఈ చేప సుమారు 13 మీటర్లు (42 అడుగులు) పొడవు ఉండి, 20 నుంచి 25 మెట్రిక్ టన్నులకుపైగా బరువు పెరుగుతోంది. సముద్రంలో హానికర జలాలను తీసుకుని శుభ్రం చేయడంతో పాటు ఆరోగ్యకర వాతావరణాన్ని కలుగజేస్తుంది. దీనికి ఉన్న ప్రత్యేకమైన మొప్పల ద్వారా నీటిలో ఉన్న చిన్న చిన్న చేపలను, జీవులను వడకట్టి తింటాయి. సముద్రంలో 1500 మీటర్ల లోతుకు వెళ్లగలిగే ఈ చేప సుమారు వెయ్యి కిలోమీటర్ల నుంచి 13 వేల కిలోమీటర్ల వరకు వలస వెళ్తుందని అధ్యయనాలు చెపుతున్నాయి. కోస్తాతీర ప్రాంతం ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండడంతో మన ప్రాంతానికి ఈ చేపలు వస్తుంటాయి. ఒక చేప 300 పిల్లలకు జన్మనిస్తుందని, వందకంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుందని అంచనా. ఈ చేపల వల్ల మానవాళికి ఎటువంటి హాని ఉండకపోవడం విశేషం. బొక్కుసొర వాటి రెక్కలు అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యంత విలువైనవి కావడంతో వీటి వ్యాపారం ఎక్కువగా సాగుతుంది. మత్స్యకారులకు సరైన అవగాహన లేక వీటిని పట్టుకోవడం వల్ల వీటి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా తగ్గిపోతోంది. అంతే కాకుండా తీరం వెంబడి విస్తరిస్తున్న ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, టూరిజం, పోర్ట్ అండ్ షిప్పింగ్, ఉప్పు మడులు, ఫెర్టిలైజర్స్, ఆక్వా కల్చర్, మత్స్య పరిశ్రమల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో 1978లో వైల్డ్ లైఫ్ సాంక్చురీలను ఏర్పాటు చేసి వన్యప్రాణులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం
సముద్ర జలాలను శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషించే బొక్కు సొరల సంరక్షణకు అన్ని చర్యలూ చేపడుతున్నాం. ప్రధానంగా ప్రపంచ బొక్కు సొర దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు బోటు యజమానులకు విద్యార్థిని, విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఈ మేరకు శనివారం ఉదయం 10 గంటలకు కాకినాడ ఎస్‌ఐఎఫ్టి (స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ)లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. అలాగే వారోత్సవాలు నిర్వహించి మత్స్యకార గ్రామాలతో పాటు ప్రధాన మార్కెట్ల వద్ద జాలర్లకు ప్రజలకు ఈ చేపపై అవగాహన కల్పించాం. ఈ చేప పట్ల మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వాటిని వేటాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒకవేళ ఈ చేపలు వలలో పడినట్లయితే వలలను ధ్వంసం చేసి సముద్రంలో వదిలి పెట్టేలా అవగాహన కల్పిస్తున్నాం. ధ్వంసమైన వలలకు సంబంధించి ప్రభుత్వం నష్టపరిహారం కూడా అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపకరించే బొక్కు సొరలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
– ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజర్,
కోరింగ అభయారణ్యం
వాటిని వేటాడితే ఏడేళ్ల జైలు
బొక్కుసొర సంరక్షణలో భాగంగా భారీ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. భారతదేశంలో బొక్కుసొర చేపలను పెద్ద పులలతో సమానంగా రక్షిస్తున్నారు. అక్రమంగా బొక్కుసొరను చంపినా, వాటి శరీర భాగాలను వ్యాపారం చేసినా 1972 వన్య సంరక్షణ చట్టం కింద ఏడేళ్ల జైలు శిక్ష, అధిక మొత్తంలో జరిమానా విధిస్తున్నారు.
చేపను కాపాడుదాం ఇలా...
సముద్రంలో ఉన్న ఈ గంభీరమైన చేపను సంరక్షించేందుకు అటవీశాఖ వన్యప్రాణి విభాగం పలు సూచనలు చేస్తోంది. చేపల వేటకు వెళ్లినపుడు మత్స్యకారులు సాధు స్వభావం గల బొక్కుసొరను పట్టడం లేదా వాటికి హానికలిగించడం చేయరాదని అవగాహన కలిగిస్తున్నారు. తూర్పుతీరం వెంబడి బొక్కుసొర తరచుగా వచ్చే ప్రదేశాలను మత్స్యకారులు, రక్షణాధికారులు అటవీశాఖ వారికి తెలియజేసి సంరక్షించాలని కోరుతున్నారు.
గ్రామాల్లో అవగాహన సదస్సులు
పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యానికి ఎంతగానో సహకరించే అతిపెద్ద చేప మనుగడ కోసం అటవీశాఖ అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. ప్రధానంగా మత్స్యకార గ్రామాలతో పాటు, జాలర్లు అధికంగా ఉండే ప్రాంతాలు, మార్కెట్ల వద్ద ప్రజలకు అటవీ సిబ్బంది చేప నమూనాలతో పాటు పోస్టర్లతో అవగాహన కల్పిస్తున్నారు.

బాగానే బొక్కుతున్నారు!

బాగానే బొక్కుతున్నారు!

బాగానే బొక్కుతున్నారు!

బాగానే బొక్కుతున్నారు!