ఆటోవాలా లబోదిబో | - | Sakshi
Sakshi News home page

ఆటోవాలా లబోదిబో

Aug 30 2025 7:24 AM | Updated on Aug 30 2025 7:24 AM

ఆటోవా

ఆటోవాలా లబోదిబో

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రోజంతా కష్టపడి ఆటో నడుపుతూ పొట్టపోసుకుంటోన్న వేలాది కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్డున పడేశారు. ఆటో నడిస్తేనే జీవన చక్రం తిరిగే కుటుంబాలు నేడు దిక్కులు చూస్తున్నాయి. ప్రయాణికులు రాక, కిరాయిలు లేక రోజు గడవక ఆటోవాలాలు నానా పాట్లు పడుతున్నారు. పూట గడవడమే గగనమైపోతోందని లబోదిబోమంటున్నారు. ఒకప్పుడు ఆడుతూ, పాడుతూ సాగిపోయిన కుటుంబాలు కాస్తా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రీ బస్సు పథకంతో అష్టకష్టాల పాలవుతున్నాయి. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా 25వేల మంది ఆటో కార్మికుల కుటుంబాలకు దిక్కుమొక్కూ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం సీ్త్రశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి తమ నోటికాడ కూడు లాగేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్‌ నిర్ణయంతో రోడ్డున పడ్డ ఆటోడ్రైవర్లు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.

నిమ్మకు నీరెత్తినట్టుగా...

అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి ఇప్పుడు కిరాయిలు లేక నెలవారీ ఈఎంఐలు చెల్లించలేక ఆటో కార్మికులు సతమతమవుతున్నారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని గడచిన ఆరేడు నెలలుగా మొత్తుకుంటున్నా ప్రభుత్వానికి కనీసం కనికరం లేదంటున్నారు. రోజుకు 10 నుంచి 15 ట్రిప్పులు వేస్తూ ఈఎంఐ చెల్లించేయగా రూ.1,000 రూ.1,200 ఇంటికి తీసుకువెళ్లే ఆటో కార్మికులకు ఫ్రీ బస్సు వచ్చిన దగ్గర నుంచి రూ.అయిదారు వందలు కూడా చేతికి రావడం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలను పోషించుకోవడం ఎలా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉచిత బస్సుతో జీవనోపాధి కోల్పోతామని తెలిసినా కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆటో యూనియన్‌లు తప్పుపడుతున్నాయి. ఎన్నికల వేళ కూటమి నేతలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన రోజు నుంచి తమకు జరుగుతోన్న అన్యాయంపై వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా సర్కార్‌ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోరుబాట

ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకపోతుందా అనే ఆశతో జిల్లాలోని జగ్గంపేట, గోకవరం, పెద్దాపురం, కాకినాడ తదితర ప్రాంతాల్లో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా శుక్రవారం పెద్దాపురం పట్టణంలో ఆటో కార్మికులు దర్గా సెంటర్‌ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీతో ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా చంద్రబాబు ఇస్తామన్న రూ.15,000 ఆర్థికసాయం అందించి భభరోసా కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

అక్కున చేర్చుకున్న జగన్‌ సర్కార్‌

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం ప్రవేశపెట్టి వారి ఉపాధికి భరోసాగా నిలిచింది. ఆటో ఉన్న ప్రతి కార్మికుడికి ఏటా రూ.10 వేలు వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం చేసి ఆదుకుంది. కోవిడ్‌ లాంటి కష్టకాలంలోనూ ఈ పథకం ద్వారా క్రమం తప్పకుండా సాయం అందించి ఆటో కార్మికులను ఆదుకుంది. వారి కుటుంబాల్లో చిరునవ్వులు చిందించేలా తోడ్పాటు అందించింది.

ఏకపక్షంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకం

ఆటో కార్మికుల ఉపాధికి గండి

దిక్కుతోచని స్థితిలో 23 వేల కుటుంబాలు

చేసిన అప్పులు తీర్చేదెలా అంటూ ఆందోళన

రూ.15 వేల ఊసెత్తని సర్కారు

కనీస కనికరం చూపని వైనం

ఆ కుటుంబాల జీవనం ఎలా?

కాకినాడ జిల్లాలో సుమారు 20 వేల మంది ఆటోలు నడుస్తున్నాయి. తగిన విద్యార్హత ఉన్నా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు లేక విద్యావంతులు కూడా ఫైనాన్స్‌పై ఆటోలు తీసుకుని నడుపుతూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. తగిన స్థోమత లేకపోయినా ఫైనాన్స్‌లో ఆటో తీసుకొని నెలనెలా ఈంఐలు చెల్లిస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంతో ఈంఐలు చెల్లించడమే కష్టమైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఆటోలు ఎక్కడం లేదు. జిల్లాలోని కాకినాడ నగరంతో పాటు తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట పట్టణాలతో పాటు జగ్గంపేట, గోకవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, కరప, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి, కోటనందూరు తదితర మండల కేంద్రాలల్లో సైతం ఆటోలే జీవనాధారంగా వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ ఫ్రీ బస్సు పథకంతో ఇప్పుడు ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

అప్పులు తీర్చలేకపోతున్నాం

మహిళలకు ఉచిత బస్సు పథకం మా పొట్టకొడుతోంది. ఈ విషయంలో చాలా ఆందోళనగా ఉన్నాం. ఆటోలు ఎక్కే ప్రయాణికుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. ట్రిప్పులు లేక ఆదాయం లేక కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. మాకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదా మరి ఏదైనా ఆదాయ మార్గాన్ని చూపించాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.

– తుమ్మల గంగాధర్‌,

ఆటో ఓనర్‌ కం డ్రైవర్‌

ఒక ట్రిప్పు వేయడమే

గగనమైపోతోంది

నా పేరు ఆళ్ల గంగాధర్‌. నేను ఆటో డ్రైవర్‌ని. తుని–కోటనందూరు మధ్య ఆటో నడుపుతాను. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసినప్పటి నుంచి ఆటోలకు డిమాండ్‌ తగ్గిపోయింది. గతంలో రోజూ మూడు ట్రిప్పులు వేసి వెయ్యి రూపాయల వరకూ సంపాదించే వాడిని. ఇప్పుడు రోజూ ఒక ట్రిప్పు వేయడమే కష్టంగా మారింది. రోజూ రూ.500 కూడా సంపాదించలేకపోతున్నాను. ఆటోకు నెలవారీ ఈంఐలు కట్టడం, కుటుంబం గడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి.

– ఆళ్ల గంగాధర్‌, ఆటోడ్రైవర్‌, కోటనందూరు

ఆదాయం పడిపోయింది

నా పేరు సుబ్రహ్మణ్యం. మాది పెద్దాపురం మండలం తిరుపతి గ్రామం. నేను ఐదేళ్లుగా ఆటో ఆధారంగా బతుకుతున్నాను. నాకు, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను గతం వరకు ప్రతి రోజు పిఠాపురం– దివిలి, సామర్లకోట–దివిలి మధ్య 10 ట్రిప్‌ లు తిరిగితే రూ.1,500 వచ్చేవి. రూ.500 ఆయిల్‌కి పోగా రూ.1,000 వస్తే నెలకు రూ.10వేలు ఆటో వాయిదా చెల్లించి మిగిలిన డబ్బులతో జీవనం సాగించేవాళ్లం. ప్రస్తుత ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టాక కనీసం ఐదు ట్రిప్‌లు కూడా వెయ్యలేని పరిస్థితి. మా బతుకులు అప్పుల పాలై వడ్డీలు చెల్లించలేకపోతున్నాం. ప్రభుత్వం దృష్టి సారించి ఆదుకోవాలి.

– సుబ్రహ్మణ్యం, తిరుపతి, పెద్దాపురం

ఆటోవాలా లబోదిబో1
1/4

ఆటోవాలా లబోదిబో

ఆటోవాలా లబోదిబో2
2/4

ఆటోవాలా లబోదిబో

ఆటోవాలా లబోదిబో3
3/4

ఆటోవాలా లబోదిబో

ఆటోవాలా లబోదిబో4
4/4

ఆటోవాలా లబోదిబో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement