కార్పొరేటుకు సలామ్‌ | - | Sakshi
Sakshi News home page

కార్పొరేటుకు సలామ్‌

Aug 25 2025 8:17 AM | Updated on Aug 25 2025 8:17 AM

కార్ప

కార్పొరేటుకు సలామ్‌

పుట్టుగొడుగుల్లా కిండర్‌ గార్డెన్‌ స్కూళ్లు

అనుమతులు పదుల్లో.. నిర్వహణ వందల్లో

ఇదే బాటలో ప్రైమరీ, హైస్కూళ్ల నిర్వహణ

నోటీసులు జారీకే విద్యాశాఖ పరిమితం

ఆమ్యామ్యాలతో చర్యలు తీసుకోని అధికారులు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కార్పొరేట్‌ శక్తులు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామనే రీతిలో వ్యవహరిస్తూ తల్లిదండ్రుల ఆశలను చక్కగా క్యాష్‌ చేసుకుంటున్నాయి. జిల్లాలో కిండర్‌ గార్డెన్‌ స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రకరకాల పేర్లు పెట్టి ఫీజులను అమాంతంగా పెంచేసి దోచుకుంటున్నారు. అనుమతుల్లేకపోయినా ఇష్టారాజ్యంగా ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. యాజమాన్యాలు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా వాటి నిర్వహణ సాగుతోంది. జిల్లాలో కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ధనదాహంతో అడ్డదారులు తొక్కుతున్నాయి. అందినకాడికి దండుకోవడమే లక్ష్యంగా వీరు చెలరేగిపోతున్నారు. పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో ప్రభుత్వ 1285, ప్రైవేట్‌ పాఠశాలలు 573 ఉన్నాయి. ఇందులో 3 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిని నర్సరీ నుంచి పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు. మరోవైపు కిండర్‌ గార్డెన్‌ పేరుతో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ నిర్వహిస్తున్న స్కూళ్లు ప్రభుత్వ అనుమతిని విధిగా పొందాల్సి ఉంది. అయితే ఎలాంటి పర్మిషన్లను పొందకుండానే జిల్లాలో 200 వరకూ ఉండగా ఒక్క కాకినాడ నగరంలోనే 50 స్కూళ్లను నిర్వహిస్తున్నారు. ఈ స్కూళ్లలో ఫీజులు రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఈ ఉదంతంపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు పేరెంట్స్‌ అసోసియేషన్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.

ప్రయోజనం లేదు

కార్పొరేట్‌ యాజమాన్యాల నుంచి మామూళ్లను భారీగా పుచ్చుకొని వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అధిక ఫీజులు, పుస్తకాల పేరిట దోపిడీ జరుగుతున్నా మిన్నకుండిపోతున్నారు. దీనిపై కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలి. అనుమతుల్లేని స్కూళ్లపై చర్యలు చేపట్టాలంటూ విద్యాశాఖాధికారులకు పలుమార్లు వినతిపత్రాలను అందజేసినా ప్రయోజనం లేదు.

– ఎం.గంగా సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

అనుమతులు పొందాల్సిందే..

నగరంలో అనుమతుల్లేకుండా పాఠశాలలను నడుపుతున్న యాజమాన్యాలకు నోటీసులను జారీ చేస్తున్నాం. నూతన విద్యా పాలసీ ప్రకారం కిండర్‌ గార్డెన్‌కు అనుమతులు పొందాల్సిందే.

– పిల్లి రమేష్‌, డీఈఓ, కాకినాడ జిల్లా

సమాచారం నిల్‌..

జిల్లా విద్యాశాఖాఽధికారి కార్యాలయంలో కిండర్‌ గార్డెన్‌ స్కూల్‌ వివరాలు నమాదైన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. కార్యాలయ అధికారులు తగిన సమాచారం లేదంటున్నారు. ఏవో మొక్కుబడిగా అనుమతుల కోసం కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయంటూ జిల్లా విద్యాశాఖ అధికారులు తాజాగా సెలవిస్తున్నారు. అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్నా, నేటికీ ఒక్క స్కూల్‌పై సైతం చర్యలు చేపట్టలేదంటేనే కార్పొరేట్‌ యాజమాన్యాలతో వారికి ఉన్న బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు పదుల సంఖ్యలో కార్పొరేట్‌ యాజమాన్యాలు అనుమతుల్లేకుండా ప్రాథమిక, హైస్కూళ్లను నిర్వహిస్తున్నాయి.

పట్టని విద్యాశాఖాధికారులు

అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు చేపట్టకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు మౌనం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల స్థాయి, అర్బన్‌ అధికారులు కనీసం ఏక్కడా తనిఖీ చేపట్టిన సందర్భాలు లేవని బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అనుమతి లేని పాఠశాలలపై కలెక్టర్‌ ఉక్కు పాదం మోపాలని పలువురు కోరుతున్నారు.

కార్పొరేటుకు సలామ్‌ 1
1/3

కార్పొరేటుకు సలామ్‌

కార్పొరేటుకు సలామ్‌ 2
2/3

కార్పొరేటుకు సలామ్‌

కార్పొరేటుకు సలామ్‌ 3
3/3

కార్పొరేటుకు సలామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement