
రక్తం చిందిన రహదారులు
● వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి
● ఆయా గ్రామాల్లో విషాదం
గోపాలపురం / రాజానగరం/ ఉప్పలగుప్తం/ శంఖవరం: రహదారులు రక్తమోడాయి.. అనుకోని ప్రమాదాలు ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గోపాలపురం మండలం సాగిపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామానికి చెందిన ముప్పిడి నరేష్ (26) బైక్‌పై అతని స్నేహితుడు నున్న బాలుతో గోపాలపురం మండలం గుడ్డిగూడెం తన చెల్లి ఇంటికి వచ్చి వేరే పనిపై సాగిపాడు వెళ్లారు. తిరిగి వస్తుండగా సాగిపాడు మలుపు వద్ద గోపాలపురం నుంచి సాగిపాడు వెళుతున్న వ్యాన్ బలంగా ఢీకొంది. దీంతో ముప్పిడి నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన నున్న బాలును 108 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పి.మనోహర్ తెలిపారు.
రాజానగరంలో మహిళ..
జాతీయ రహదారిపై రాజానగరం వైఎస్సార్ జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన అనిశెట్టి లత (39) మృతి చెందింది. రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్ సమీపంలో నివాసం ఉంటున్న లత రాజానగరంలోని బంధువుల ఇంటికి వచ్చింది. పై జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న ఆమెను బైకు ఢీకొనడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి భర్త అనిశెట్టి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రొయ్యల వ్యాన్ ఢీకొని..
రొయ్యల వ్యాన్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉప్పలగుప్తం ఎస్సై రాజేష్ కథనం ప్రకారం.. వానపల్లిపాలేనికి చెందిన కోలా వీర రాఘవులు (75) ఉప్పలగుప్తం నుంచి వానపల్లిపాలెం సైకిల్‌పై వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రొయ్యల వ్యాన్ వానపల్లిపాలెం వైపు వెళ్తూ వీర రాఘవులకు తగిలింది. దీంతో అతను తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించామని ఎస్సై వివరించారు.
కత్తిపూడిలో మరొకరు..
కత్తిపూడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన మోతే సూరిబాబు (40) లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. తాటిపర్తి నుంచి పాట్నా బొగ్గు లోడు లారీలో క్లీనర్‌గా వెళ్తుండగా కత్తిపూడి ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద పని నిమిత్తం సూరిబాబు లారీ దిగాడు. పని ముగించుకుని రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం అడిషినల్ ఎస్సై ప్రసాద్ తెలిపారు.

రక్తం చిందిన రహదారులు