
ఆనంద తాండ్రవం
● ఏడాది పొడవునా తాండ్ర తయారీ
● జిల్లాలో 17 పరిశ్రమల్లో కూలీలకు ఉపాధి
● వివిధ జిల్లాలకు సరకు ఎగుమతి
కాకినాడ రూరల్: తాండ్ర తినవయ్యా... ఆనందించవయ్యా అన్నట్లు మామిడి తాండ్రకు కాకినాడ జిల్లా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏడాది పొడవునా తాండ్రను తయారు చేయడం విశేషం. అందుకే చిన్నారుల నుంచి పెద్దల వరకూ లొట్టలేసుకుని తింటుంటారు. మామిడి కాయలుగా ఉన్నప్పుడు ఆవకాయ, ఊరగాయగా.. పండ్ల రసంతో తాండ్ర రుచిని ఏడాది పొడవునా ఆస్వాదిస్తున్నారు. తియ్యదనాన్ని పంచే తాండ్ర తయారీలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి తాండ్రను ఇతర రాష్ట్రాల ప్రజలు లొట్టలేసుకుని తినేలా ప్రాచుర్యం పొందింది. స్థానికంగా పండే మామిడితో పాటు ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుని తాండ్ర తయారీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవి ఎండల వేళ పనులు లేని సమయంలో కుటీర పరిశ్రమగా నిలుస్తున్న ఈ తయారీ ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి అందిస్తోంది. జిల్లాలో ముఖ్యంగా కాకినాడ రూరల్ మండలంలో పండూరు, సర్పవరం, తమ్మవరం గ్రామాలు ప్రసిద్ధి చెందాయి. సర్పవరంలో సుమారు ఎనిమిది దశాబ్దాల కిందట ప్రారంభమైన దినదిన ప్రవర్థమానంగా మారింది. కాకినాడ రూరల్‌తో పాటు చేబ్రోలు, చిన్నయ్యపాలెం, ధర్మవరం, జగ్గంపేట మండలం రాజపూడి, మల్లిసాల తదితర గ్రామాలకూ ఈ వ్యాపారం విస్తరించింది. జిల్లా సుమారు 17 చోట్ల ఏడాది పొడవునా తాండ్ర తయారు చేస్తున్నారు. అత్యధికంగా కాకినాడ రూరల్‌లో తయారీ ఉంది. వేసవిలో మొదలై ఏడాది పొడవునా కూలీలకు పనులు కల్పిస్తున్నారు. మన ప్రాంతంలో పండే మామిడి కాయలతో పాటు కృష్ణా జిల్లా నూజివీడు, ఖమ్మం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి లారీల్లో భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. ఏటా సీజనల్‌గా జిల్లాకు 80 వేల టన్నులకు పైబడి మామిడి దిగుమతి అవుతుందని అంచనా. వేసవిలోనే తాండ్ర తయారీతో సరిపెట్టుకోకుండా, ఏడాదికి సరిపడే మామిడి జ్యూస్‌ను తయారు చేసుకుని నిల్వ ఉంచుకుంటున్నారు. తద్వారా ఏడాది పొడవునా డిమాండ్‌కు అనుగుణంగా తాండ్ర తయారు చేస్తున్నారు. వేసవిలో ఏటా సుమారు 2 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అన్ సీజనల్‌లో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ తయారయ్యే తాండ్రను ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. ఏటా సుమారు 50 వేల నుంచి 70 వేల టన్నుల వరకూ ఎగుమతి అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
తగ్గిన ధరలతో జోష్
ఈ ఏడాది వేసవిలో మామిడి ధరలు తగ్గాయి. తాండ్ర తయారీలో కలెక్టర్ రకం మామిడిని వినియోగిస్తారు. గత ఏడాది టన్ను ధర రూ.20 వేల వరకూ పలకగా ఈ ఏడాది అఽత్యధికంగా రూ.13 వేలు పలికింది. సీజన్ ముగింపు దశలో ఽమామిడి ధరలు పతనమవ్వడంతో టన్ను కాయలు రూ.6 వేలకు రావడంతో తాండ్ర తయారీదారులు జ్యూస్ నిల్వలు పెంచుకోగలిగారు. అందుకే ఈ ఏడాది వ్యాపారం బాగుందని అంటున్నారు.
ఆరోగ్యానికి ఎంతో మేలు
సీజనల్‌గా లభ్యమయ్యే మామిడి పండ్ల రసంతో తయారు చేసే తాండ్ర ఏడాది పొడవునా లభ్యమవుతోంది. దాదాపు 20 గ్రాముల తాండ్రలో 67 కేలరీలు పోషకాలు, 0.3 గ్రాముల ప్రోటీన్లు, 0.1 గ్రాముల కొవ్వు, 17.5 గ్రాముల కార్బో హైడ్రైట్లు ఉంటాయి. ఇందులో ఉన్న విజమిన్– ఏ శరీర ఆరోగ్యంతో పాటు కంటిచూపునకు మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. విటమిన్ – సీ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు, వ్యాధుల నుంచి రక్షణకు దోహదపడుతుంది. తాండ్రలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో శరీర కణాలకు మేలు చేయడమే కాకుండా పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పీజు పదార్థాలు పేగుల కదలికల క్రమబ ద్ధీకరణకు, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ తీసుకోవడమే మేలు. అధికంగా తింటే దంత క్షయం, ఊబకాయం సమస్యలు రావొచ్చు.

ఆనంద తాండ్రవం

ఆనంద తాండ్రవం