సేవలు నిలిఛీ... | - | Sakshi
Sakshi News home page

సేవలు నిలిఛీ...

Aug 25 2025 8:17 AM | Updated on Aug 25 2025 8:17 AM

సేవలు

సేవలు నిలిఛీ...

సచివాలయాల్లో ఆగిన ఆధార్‌ కేంద్రాలు

డీఏల బదిలీల్లో లోపించిన పారదర్శకత

ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పోస్టల్‌ శాఖ

మీ సేవా కేంద్రాల్లో పడిగాపులు

ఆలమూరు: సేవలకు స్వస్తి పలికారు.. మనకెందుకులే అని మంగళం పాడారు.. అన్నింటికీ ఆధార్‌ తప్పనిసరి అని చెబుతూనే వీటి మంజూరు, మార్పులు, చేర్పులకు ఎక్కడా అవకాశం లేకుండా చేశారు.. గత ప్రభుత్వంలో సచివాలయాల్లో అందించిన ఆధార్‌ సేవలకు గుడ్‌ బై చెప్పడం, పోస్టాఫీసుల్లో సరైన సాఫ్ట్‌వేర్‌ లేదని ఆపేయడంతో దిక్కుతోచక సేవల కోసం లబ్ధిదారులు అటూ ఇటూ పరుగులు తీసే రోజులు తెచ్చారు.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ పురుడు పోసుకుంది. సమస్త సేవలకు కేంద్ర బిందువు అయ్యింది. ఇలా జిల్లాలోని 385 గ్రామాల పరిధిలో 515 సచివాలయాలు ఏర్పడ్డాయి. ఇందులో 467 గ్రామ, 48 వార్డు సచివాలయాలు ఉన్నాయి. గ్రామ సచివాలయాల ద్వారా 5.24 లక్షల కుటుంబాలకు చెందిన 18.33 లక్షల జనాభాకు నిత్యం సేవలు అందించాల్సి ఉంది. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటైన 2,578 ఆధార్‌ కేంద్రాల ద్వారా రోజుకు సుమారు పది వేల మంది వరకూ నామమాత్రం రుసుంతో సేవలు పొందేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అస్తవ్యస్త విధానాలతో సేవలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తోంది. ఉదాహరణకు, ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామ సచివాలయంలో గత వైఎస్సార్‌ సీపీ హయాంలో ఆధార్‌ కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడి డిజిటల్‌ అసిస్టెంట్‌కు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ అందించింది. దీంతో రోజూ సుమారు 50 మంది ఆధార్‌ సేవలు అందించేవారు. ఇటీవల ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా జరిపిన బదిలీల్లో ఆ డిజిటల్‌ అసిస్టెంట్‌ కపిలేశ్వరపురం మండలానికి వెళ్లిపోయారు. ఇలా ఇక్కడ ఆధార్‌ సేవలు నిలిచిపోయాయి. పెదపళ్ల సచివాలయానికి బదిలీపై వచ్చిన కొత్త డిజిటల్‌ అసిస్టెంట్‌కు ఆధార్‌ సేవల పట్ల అవగాహన లేదు. బదిలీ సమయం, అంతకు ముందుకాని, ఆ తరువాత కాని ఆధార్‌ సేవలకు సంబంధించి ప్రభుత్వం శిక్షణ ఇవ్వలేదు. దీంతో ఆధార్‌ కేంద్రానికి వెళితే ప్రభుత్వం ఇంకా ఆధార్‌ సేవలకు సంబంధించి ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేవని, ఇంకా ఆధార్‌ బాధ్యతలు అప్పగించ లేదని ఠక్కున సమాధానం వస్తుంది. జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఆధార్‌ సేవల కోసం శిక్షణ తీసుకున్న డిజిటల్‌ అసిస్టెంట్లను ఆధార్‌ కేంద్రం లేని చోటుకు, శిక్షణ తీసుకోని డిజిటల్‌ అసిస్టెంట్‌ను ఆధార్‌ కేంద్రం వద్దకు బదిలీ చేయడం వల్లే ఈ దుస్థితి దాపురించిందనే ఆరోపణ ఉన్నాయి. బదిలీలు జరిగి రెండు నెలలు కావొస్తున్నా ఆధార్‌ కేంద్రం ఉన్న సచివాలయానికి బదిలీపై వెళ్లిన డిజిటల్‌ అసిస్టెంట్లకు ఇప్పటి వరకూ శిక్షణ మాత్రం ఇవ్వలేదు.

చేసేదిలేక.. ఎదురుచూడలేక

గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ రోజురోజుకు నిర్వీర్యం అవుతుంది. ఇటీవల హేతుబద్ధీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలు ప్రహసనంగా మారింది. బదిలీల్లో పారదర్శకత లేక గ్రామ సచివాలయాల్లో ఆధార్‌ సేవలు అందకుండా పోయాయి. అత్యవసర సేవల కింద పోస్టాఫీస్‌ల వద్దకు వెళ్లి చేయించుకుందామన్నా సాఫ్ట్‌వేర్‌ మారిందంటూ పోస్టల్‌ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. చేసేదేమీ లేక మీ సేవా కేంద్రాలను ఆశ్రయిస్తూ గంటల తరబడి ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడక్కడా కొన్నిచోట్ల స్లాట్‌ విధానం పేరిట నిర్వాహకులు అడ్డగోలుగా దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పోస్టల్‌... సేవలు డల్‌

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్‌ పోస్టాఫీసుల్లో ఆధార్‌ సేవలను అందించాలి. దానికనుగుణంగా సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు సాంకేతిక పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. అయితే రెండు నెలల కిందట పోస్టల్‌కు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ మారిందంటూ ఇక్కడా ఆధార్‌ సేవలు నిలిపివేశారు. మండలానికి రెండు లేదా మూడు పోస్టాఫీస్‌లు ఉన్నా పని భారమో లేక పని ఒత్తిడి వల్లనో తెలియదు కాని జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల పోస్టల్‌ ఉద్యోగులు ఆధార్‌ సేవలను అందించేందుకు సుముఖంగా ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ

పోస్టల్‌, సచివాలయాల నుంచి ఆధార్‌ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో మీ సేవా కేంద్రాలే ఆధార్‌ సేవలను అందిస్తున్నాయి. అయితే మీసేవా కేంద్రాలు మండలాల్లో పరిమితంగా ఉండటంతో ని త్యం రద్దీ ఉంటుంది. కొన్ని కేంద్రాల్లో స్లాట్‌ విధా నం పేరిట ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు అందించే రుసుం కంటే మూడు లేదా నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారని అంటున్నా రు. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక ఆధార్‌ సేవలు అత్యంత ఖరీదుగా మారిపోయాయి.

సేవలు నిలిఛీ...1
1/1

సేవలు నిలిఛీ...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement