
ఏలేరులో పెరిగిన నీటి నిల్వలు
ఏలేశ్వరం: ఏలేరు పరివాహక ప్రాంతంలో పడిన వర్షాలకు ప్రాజెక్టులో నీటినిల్వలు పెరిగాయి. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 2.198 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 525 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఆదివారం నాటికి ప్రస్తుతం ప్రాజెక్టులో 86.56 మీటర్లకు 80.02 మీటర్లు, 24.11 టీఎంసీలకు 13.48 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. దీంతో ఆయకట్టుకు 1,000, విశాఖకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజుచెరువుకు నీటి విడుదల నిలిపివేశారు.
నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్
కాకినాడ సిటీ: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జిల్లా స్థాయిలో సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ హాలులో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు అందరూ విధిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి రాలేని అర్జీదారులు వారి అర్జీలను మీకోసం డాట్ ఏపీ డాట్ జీవోవి డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు వారి అర్జీల నమోదు స్థితి, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు.
తలుపులమ్మకు రూ.4.98 లక్షల ఆదాయం
తుని: లోవ తలుపులమ్మతల్లికి రూ.4.98 లక్షల ఆదాయం సమకూరిందని కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించారన్నారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,67,550, పూజా టికెట్ల ద్వారా రూ.1,71,690, కేశఖండన టికెట్ల ద్వారా రూ.12,820, వాహన పూజల టికెట్లకు రూ.12,140, కాటేజీల ద్వారా రూ.71,186, విరాళాలుగా రూ.62,863 మొత్తం రూ.4,98,249 ఆదాయం సమకూరిందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని ఈఓ వివరించారు.
కన్నబాబుకు
మాజీ మంత్రుల పరామర్శ
కాకినాడ రూరల్: పితృ వియోగంతో బాధపడుతున్న వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటరు, కాకినాడ రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు, ఆయన సోదరుడు, సినీ దర్శకుడు కళ్యాణ్‌కృష్ణలను వైద్యనగర్ నివాసంలో ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు గొర్ల కిరణ్‌కుమార్, పొన్నాడ సతీష్, వైఎస్సార్ సీపీ రాజాం, ఆమదాలవలస కో ఆర్డినేటర్లు టి.రాజేష్, చింతాడ రవికుమార్ తదితరులు కన్నబాబును కలిసి ఓదార్చారు. ఆయన తండ్రి సత్యనారాయణ చిత్ర పటానికి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. త్వరగా కోలుకొని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా కన్నబాబుకు పలువురు నేతలు సూచించారు.