
లిపి లేని కంటి భాష.. చిత్రం
● చరిత్రకు సాక్ష్యం చెప్పే ఛాయాచిత్రం
● మానవ జీవితానికి విడదీయని బంధం
● సాంకేతిక పరిజ్ఞానంతో
విప్లవాత్మక మార్పులు
● రేపు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
రాయవరం: కన్ను తెరిస్తే జననం.. కన్నుమూస్తే మరణం అన్నాడో మహానుభావుడు. కానీ.. ఈ పరికరం ‘క్లిక్’ అంటే మాత్రం ఆ దృశ్యం కలకాలం సజీవంగా ఉండిపోతుంది. అదే ఫొటోగ్రఫీ. పరిమితులు లేకుండా ప్రపంచంలోని ఏ ప్రాంతం వారికై నా అర్ధమయ్యేది.. పండితుల నుంచి పామరుల వరకు భాషకందని భావాన్ని సులువుగా అర్ధం చేసుకోగలిగే ఏకై క మాధ్యమం ఫొటోగ్రఫీ. అందుకే ఫొటోలు భాషలేని.. భావ దృశ్య కావ్యాలని అంటుంటారు. క్షణకాలంలో కరిగిపోయే జ్ఞాపకాల దొంతరలను కెమెరా కన్నుతో క్లిక్ మనిపించి.. కళ్లముందు సాక్షాత్కరింపజేసేవే ఛాయాచిత్రాలు. బాల్యం.. యవ్వనం.. వృద్ధాప్యం ఇలా గడిచిపోయిన మానవ జీవనయానాన్ని కనులారా వీక్షించే అపురూప అవకాశం కల్పిస్తాయి. ఓ ఛాయా చిత్రం కోటి భావాల్ని పలుకుతుంది. చరిత్రను, సంస్కృతిని చాటిచెబుతాయి. ఫొటోగ్రఫీ అనేది అద్భుత కళ. ఇందులో నేడు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకటిన్నర శతాబ్దాలకు పైగా ఫొటోగ్రఫీ ప్రక్రియ ఉన్నా, రెండు దశాబ్దాలుగా విప్లవాత్మక పరిణామాలు సంతరించుకున్నాయి. కెమెరా పితామహుడు డాగురేకు పేటెంట్ లభించిన రోజును ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
పలు రకాల మోడళ్లు
ఫొటోగ్రఫీ ఉద్భవించి సుమారు 199 ఏళ్లవుతుంది. ఇటీవల ఫొటోగ్రపీలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆధునిక, సాంకేతిక విప్లవం ఫొటోగ్రఫీ దశ, దిశను మార్చేసింది. గతంలో ఫొటో తీసుకోవడమంటే గొప్ప అనుభూతి, సుదీర్ఘప్రక్రియ. ఇప్పుడు ప్రతి మనిషి వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ రూపంలో కెమెరా ఉంది. ఫొటో తీసుకోవడం ఇప్పుడు సులువుగా మారింది. కెమెరాల్లోనూ రకరకాల ఫీచర్లతో రోజుకో మోడల్ వస్తుంది. అంతరిక్షం.. వైద్య రంగం.. ఇలా ఫొటోగ్రపీ ప్రక్రియ లేనిదే ఏ పనీ జరగని పరిస్థితి నెలకొంది. రోలికార్డ్, రైస్ ల్యాండర్, రోలీ ఫ్లెక్స్, నికాన్, కేనన్ వంటి ఎన్నో కంపెనీల కెమెరాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. రూ.వేల నుంచి రూ.లక్షల విలువైన కెమెరాలు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి.
ప్రజా సమస్యలకు అద్దం పడుతూ..
ఇలాఉండగా ప్రజల సమస్యలను పత్రికల ద్వారా అధికారులు, పాలకుల దృష్టికి తేవడంలో ఫొటోలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో ఫొటోల ఆవశ్యకత ఎనలేనిది. ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ల రాకతో కెమెరాల ప్రాభవం కాస్త తగ్గినా, విలక్షణ ఫొటోలకు మాత్రం స్టూడియోలు, కెమెరాలను ఆశ్రయించక తప్పదు.
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా..
ఫొటోగ్రఫీ పదం గ్రాఫోన్ నుంచి పుట్టింది. గ్రాఫోన్ అంటే రాయడం, చిత్రించడం అని అర్ధం. తొలిసారి 1826లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త జోసఫ్ నైసిఫర్ నిస్సీ కనిపెట్టిన తొలి కెమెరా పరికరంతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రీల్ నుంచి డిజిటల్ పరిజ్ఞానానికి మారింది. ఫొటోగ్రఫీలో లెన్సుల ప్రవేశం తర్వాత సుదూర దృశ్యాలనూ నాణ్యత తగ్గకుండా ఫొటో తీసే విధానం అందుబాటులోకి వచ్చింది. సెల్‌ఫోన్‌లో బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాక ఫొటోగ్రఫీ ఎక్కడికో వెళ్లిపోయింది. సామాజిక మాథ్యమాల్లో ఫొటోల పాత్ర కీలకంగా మారింది. ఇటీవల నాలుగు వైపులా రెక్కలతో ఆకాశంలో ఎగిరి.. చిత్రాలు, వీడియోలు తీసే డ్రోన్ కెమెరాల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఫొటోగ్రఫీలో డిజిటల్ యుగం నడుస్తోంది. డిజిటల్ యుగంలో డ్రోన్ కెమెరాలు కూడా వాడకం బాగా పెరిగింది.
జిల్లాలో 140 ఏళ్ల చరిత్ర
ఫొటోగ్రఫీలో జిల్లాకు 140 ఏళ్ల చరిత్ర ఉంది. కాకినాడలో చెక్కా బసవరాజు అండ్ సన్స్ 1885లో హాబీగా ఫొటోగ్రఫీని చెక్కా బసవరాజు ప్రారంభించారు. ప్రస్తుతం నాలుగు తరాలుగా ఫొటోగ్రఫీలో వారి కుటుంబం రాణిస్తోంది. కోనసీమ జిల్లాలో 19 ఫొటోగ్రాఫర్ల సంఘాలుండగా.. 1,400 మంది ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 4 వేలకు పైగా ఫొటో స్టూడియోలు ఉండగా, భారీ స్థాయిలో కెమెరా, ఫొటో ల్యాబ్స్ 20కి పైగా ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఆరు వేల మందికి పైగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.
ప్రభుత్వ సహకారం అవసరం
ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వ సహకారం అవసరం. టెక్నాలజీ అభివృద్ధి చెందడం మంచిదే కానీ, ఫొటోగ్రాఫర్ల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్ల ప్రభావం మా వృత్తిపై తీవ్రంగా ఉంది. ఫొటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
– గెడ్డం సురేష్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు,
ఫొటో గ్రాఫర్ల సంఘం, కొత్తపేట, కోనసీమ జిల్లా
అప్‌డేట్ అవ్వాల్సిందే..
ఫొటోగ్రఫీలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఫొటోగ్రాఫర్లు కూడా అప్‌డేట్ కావాల్సిన అవసరం ఉంది. అలా కానివారు వృత్తిలో వెనుకబడుతున్నారు.
– సంగుల దొరబాబు, ప్రధాన కార్యదర్శి,
ఫొటోగ్రాఫర్ల సంఘం, మండపేట, కోనసీమ జిల్లా
పసితనంలోకి జారేలా..
ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడానికి అక్షరాలు సరిపోవు. వేయి పదాలతో చెప్పలేని భావాన్ని ఒక్క కెమెరా క్లిక్‌తో చెప్పవచ్చు. అందరికీ అర్ధమయ్యే భాష.. మధురమైన జ్ఞాపకం ఫొటో. తీరిక వేళల్లో ప్రశాంత సమయంలో చిన్ననాటి ఫొటో ఆల్బమ్ చూసుకుంటూ.. నాటి జ్ఞాపకాల పేజీలను తిరగేస్తుంటే మెల్లగా పసితనంలోకి జారిపోతాం. పొడవాటి చొక్కాలు.. లూజు నిక్కర్లు.. బుట్టబొమ్మల్లాంటి గౌన్లు.. పొడవాటి పావడాలు.. పిలక జడలు.. ఇలా చూసుకుంటూ.. మురిసిపోతుంటే అదో అందమైన అనుభూతి.
సర్వసాధారణంగా మారి..
గతంలో కెమెరాలు ప్రత్యేకంగా తీసుకుని వెళ్లాల్సి వచ్చేంది. ఇప్పుడు ప్రతి సెల్‌ఫోన్‌లో కెమెరా సర్వసాధారణ అంశంగా మారింది. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. సెల్‌ఫోన్లలో కెమెరాల సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్న వారి కోసం ప్రత్యేకంగా సెల్‌ఫోన్ సంస్థలు తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. అవి మల్టీపర్పస్‌గా ఉపయోగపడుతుండడంతో ప్రతి ఒక్కరికీ ఫొటోలు తీయడం అలవాటుగా మారింది.

లిపి లేని కంటి భాష.. చిత్రం

లిపి లేని కంటి భాష.. చిత్రం

లిపి లేని కంటి భాష.. చిత్రం