పండగ నుంచి దండగ వైపు.. | - | Sakshi
Sakshi News home page

పండగ నుంచి దండగ వైపు..

Aug 17 2025 6:11 AM | Updated on Aug 17 2025 6:11 AM

పండగ

పండగ నుంచి దండగ వైపు..

పేరుకే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు

అమలుకు నోచుకోని ప్రభుత్వ పథకాలు

ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోతున్న వైనం

రుణాల కోసం ఆశగా ఎదురుచూపులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వం హయాంలో తమకు తీరని అన్యాయం జరుగుతోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండగగా సాగిన తమకు ఈ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని వారు అంటున్నారు. గ్రామ స్థాయిలో విత్తనం మొదలు విక్రయం వరకూ ప్రభుత్వ సేవలన్నీ రైతుల చెంతకే వచ్చేవి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. కౌలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. ఖరీఫ్‌ సీజన్‌లో కౌలు రైతుల గుర్తింపు విషయంలో జాప్యం చోటుచేసుకోవడం వల్ల వారికి ఎరువులు, విత్తనాలు అందడం లేదు. మరోవైపు బ్యాంకుల నుంచి పెట్టుబడి రుణాలు సైతం అందడం లేదు. దీంతో ఈ ఏడాదికి కౌలు రైతులకు కూటమి ప్రభుత్వం మొండి చూపుతున్నట్టే అనుకోవాలి. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు కానీ అవి నిరుపయోగంగా మారాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో వాటి ఆధారంగా బ్యాంకుల్లో రుణాలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం ఈ సీజన్‌ ముగిసినా ఒక్క కౌలు రైతుకు కూడా నయా పైసా రుణం ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రబీ సీజన్‌ మొదలై నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకూ వారికి ఈ ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందలేదు. దీంతో కౌలు రైతులు బయట వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

గుర్తింపు కార్డుతో సరి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో 35 వేల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి ఒక్క పథకం కూడా దక్కలేదు. గత ఏడాది కౌలు రైతులకు పంట నష్ట పరిహారం కానీ, బ్యాంకులో రుణం కానీ ఇవ్వలేదు. దీంతో వారంతా గత ప్రభుత్వంలోనే తమకు ఎంతో మేలు జరిగిందని, ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆనాటి సేవలను గుర్తుచేసుకుంటున్నారు.

అప్పుల పాలవుతున్న కౌలు రైతులు

ప్రస్తుతం ఎకరా భూమి సాగు చేసుకోవాలంటే యజమానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ కౌలు చెల్లించాలి. ఆ మొత్తం చెల్లించిన అనంతరమే కౌలు రైతులు సాగులోకి వెళతారు. విత్తనాల కొనుగోలు మొదలు, పంట దమ్ము, వరినాట్లు వేయడం, ఎరువులు, పురుగు మందులు ఇలా అన్నింటికీ మరో రూ.25 వేలు పైబడి పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ మేరకు ఒక ఎకరం భూమి కౌలు చేయాలంటే రూ. 50 వేలు అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డు ఉన్న ప్రతి రైతుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఎటువంటి హామీ లేకుండా పంట రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం గుర్తింపు కార్డులు ఇచ్చినప్పటి కీ ఎటువంటి రుణాలు ఇవ్వకపోవడంపై వారు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కౌలు రైతులు బయ ట వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుకోవడంతో వచ్చిన పంట అంతా కౌలుకు, పెట్టుబడి రుణాలు, వాటికి వడ్డీలకే పోతోందని అంటున్నారు. అదే ప్రభుత్వం నుంచి బ్యాంకుల్లో రుణాలు ఇస్తే తక్కువ వడ్డీ కావడంతో తమకు ఆ మొత్తమైనా మిగిలేదని రైతులు అంటున్నారు.

ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025

భూములున్నవారంతా సాగుదారులనీ కాదు.. సాగుదారులందరూ భూస్వాములు కావాలనీ లేదు. ఆ ఇరువర్గాల బంధం అనాదిగా ఎంతో బలమైనదీ.. అదే క్రమంలో సున్నితమైనదీ. నమ్మకం ప్రాతిపదికన సాగే ఈ పవిత్ర బంధంలో నిజాయితీగా చెప్పాలంటే కష్టం కచ్చితంగా సాగుదారుదే. పంట దిగుబడి బాగుంటే లాభంలో వాటా తీసుకునే భూస్వామి.. నష్టపోతే మాత్రం కిమ్మనని పరిస్థితి. పైగా కచ్చితంగా కౌలు వసూలుచేస్తుంటారు. ఈ క్రమంలో కౌలు రైతుల కష్టాన్ని గుర్తించిన గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం భూస్వామికి ఏమాత్రం నష్టం కలగని రీతిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చింది. వారికి సాగుహక్కు గుర్తింపు కార్డులు అందజేసి పెట్టుబడి సాయం.. ప్రకృతి సహకరించక పంట నష్టపోతే పరిహారం.. సాగులో మెళకువలు, విత్తనం నుంచి విక్రయం వరకు ఎన్నో ప్రయోజనాలు చేకూరేలా విధివిధానాలు రూపొందించింది. దీంతో ఆ ప్రభుత్వంలో ఐదేళ్లూ సాగును పండగలా చేసుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వం మారింది. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు మళ్లీ గద్దెనెక్కారు. దీంతో మళ్లీ కౌలు రైతులకు పాతకష్టాలు మొదలయ్యాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలనే ఇస్తున్నట్టు కలరింగ్‌ ఇస్తూ వాటికి వెచ్చించాల్సిన నిధులు మాత్రం పైసా కూడా విదల్చడం లేదు. దీంతో కౌలు రైతులు ఏ పనులూ మొదలుపెట్టలేక.. రుణాల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద చేతులు చాస్తూ నానా అగచాట్లు పడుతున్నారు.

సంవత్సరం కౌలు ఇచ్చిన

కార్డులు రుణాలు

(రూ.కోట్లలో)

2020-21 36,795 18.73

2021-22 44,580 47.17

2022-23 41,322 46.46

2023-24 56,399 53.80

ఎందుకూ ఉపయోగపడడంలేదు

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. వారందరికీ రైతులతో సమానంగా ప్రభుత్వ పథకాలు అందించి, పంట రుణాలు అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పైబడినా ఇంత వరకూ తమకు ఇచ్చిందేమీ లేదు. నాయకుల హామీ కోసం ఎదురుచూడటమే కానీ వీసమెత్తు ప్రయోజనం కనబడటంలేదు. గుర్తింపు కార్డులు నాలుక గీసుకోవడానికి కూడా ఉపయోగపడటంలేదు.

– మారెళ్ల వెంకటరమణ, కౌలురైతు,

యండమూరు, కరప మండలం

కౌలు రైతు మాటే లేదు

కూటమి ప్రభుత్వం కౌలు రైతులను అసలు పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా 4 ఎకరాలు భూమిని కౌలుకు చేస్తున్నాను. ఇప్పటికీ కౌలు కార్డు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కార్డు అడిగితే నేను కౌలుకు తీసుకున్న భూమి నీటి తీరువా వడ్డీతో చెల్లించాలని అధికారులు ఇబ్బంది పెడుతున్నారు.

– ఇంటి వెంకటరావు, కౌలు రైతు వీకే

రాయపురం, సామర్లకోట మండలం

కౌలు రైతులకు నాడు ఎంతో ‘భరోసా’

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేసేవారు. నిరుపేద కౌలు రైతులైన ఎస్సీ, బీసీలకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఐదేళ్ల పాటు వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. రైతులకు ఇచ్చినట్టే ప్రతి కౌలు రైతుకు ఏడాదికి రూ.13,500 వారి ఖాతాల్లో జమ చేశారు. వీటితో పాటు పంట నష్ట పరిహారం కూడా వారికి అందించేవారు. ప్రకృతి వైపరీత్యాలకు పంట దెబ్బ తింటే ఆ నష్ట పరిహారం సైతం అందే విధంగా నాటి పాలకులు చర్యలు తీసుకున్నారు. కానీ గత నెలలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగినా కౌలు రైతులకు ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేవలం భూ సర్వే నెంబర్ల ఆధారంగా ఆయా రైతుల ఖాతాల్లో పంట నష్ట పరిహారం జమ కావడంతో భూ యజమానులు ఆ పరిహారాన్ని కౌలు రైతులకు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. పంట నష్టపోయినా ప్రతి ఎకరాకు రూ.10 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేసింది కానీ కౌలు రైతులకు మొండి చెయ్యి చూపింది. దీంతో పంట నష్టపోయి, ఇచ్చిన కౌలు మొత్తం కూడా రాకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోయారు. అయినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు.

పండగ నుంచి దండగ వైపు..1
1/2

పండగ నుంచి దండగ వైపు..

పండగ నుంచి దండగ వైపు..2
2/2

పండగ నుంచి దండగ వైపు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement