
రత్నగిరిపై కృష్ణాష్టమి వేడుక
సప్తగోకులంలో నల్లనయ్యకు ప్రత్యేక పూజలు
అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం స్వామివారి సన్నిధిలో గోపూజోత్సవం, రాత్రి ఉట్ల ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు రామరాయ కళావేదికపై సత్యదేవుడు అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేసిన అనంతరం గోపూజోత్సవం నిర్వహించారు. అనంతరం గోవులకు బెల్లం, బియ్యం తినిపించారు. తరువాత భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగబాబు, యనమండ్ర ఘనపాఠీ, శివ ఘనాపాఠి, ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకుడు దత్తాత్రేయశర్మ, స్పెషల్‌గ్రేడ్ వ్రతపురోహితుడు చామర్తి కన్నబాబు తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు సత్యదేవుడు అమ్మవార్లను ఊరేగింపుగా రామాలయం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజల అనంతరం ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీగోకులానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సప్తగోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా శ్రీకృష్ణుడికి అర్చకుడు కంచిభట్ల వరదయ్య, పరిచారకుల పూజలు చేశారు. గోకులాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
వరుస సెలవులతో భక్తజన సంద్రం
వరుస సెలవులతో రత్నగిరి భక్తులతో పోటెత్తింది. స్వాతంత్య్ర దినోత్సవం, కృష్ణాష్టమి, శని, ఆదివారాలు కలసిరావడంతో రత్నగిరి భక్తజన సంద్రమైంది. శనివారం 50 వేల మంది స్వామివారిని దర్శించారు. దీంతో ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత మండపాలు కిటకిటలాడాయి. స్వామివారి వ్రతాలు నాలుగు వేలు జరిగాయని, స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్‌తో ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని అధికారులు తెలిపారు. అన్ని విభాగాల ద్వారా రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని, నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్టు వారు తెలిపారు. కాగా వర్షం వల్ల స్వామివారి ప్రాకార సేవ గోపురం లోపలే నిర్వహించారు.

రత్నగిరిపై కృష్ణాష్టమి వేడుక