
పంపాకు భారీగా వరద నీరు
● వంద అడుగులకు చేరిన నీటిమట్టం
● ముందు జాగ్రత్తగా 500 క్యూసెక్కుల విడుదల
అన్నవరం: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో స్థానిక ‘పంపా’ రిజర్వాయర్ నీటిమట్టం శనివారానికి వంద అడుగులకు చేరుకుంది. పంపా గరిష్ట నీటిమట్టం 103 అడుగులు. పంపా క్యాచ్‌మెంట్ ఏరియా శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని ఏజెన్సీ గ్రామాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రిజర్వాయర్‌లోకి 500 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ముందు జాగ్రత్తగా బ్యారేజీ నాలుగో నెంబర్ గేటు ఎత్తి 500 క్యూసెక్కుల నీరు సముద్రానికి విడుదల చేస్తున్నారు. పంపా ఆయకట్టుకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సబ్సిడరీ డ్యామ్ ద్వారా 20 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పంపా రిజర్వాయర్ ఘరిష్ట నీటి నిల్వ 0.43 టిఎంసీ కాగా, ప్రస్తుతం 0.30 టిఎంసీ నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
నిల్వ ఉంచే పరిస్థితి లేదు
పంపా బ్యారేజీ గేట్లు బలహీనంగా ఉండడంతో రిజర్వాయర్‌లో నీటిని 99 అడుగులకు మించి నిల్వచేసే పరిస్థితి లేదు. అంతకన్నా ఎక్కువ నీటిని నిల్వచేస్తే గేట్ల నిర్వహణ కష్టంగా ఉంటుందని, ఒకవేళ జరగరానిది జరిగి గేట్లు కొట్టుకుపోతే దిగువన పొలాలు, గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.
నీటిమట్టం పెరిగితే మరింత విడుదల : ఈఈ శేషగిరిరావు
పంపా రిజర్వాయర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. 99 అడుగులపైకి వచ్చిన నీటిని సముద్రానికి విడుదల చేస్తాం. ప్రస్తుతం వంద అడుగుల నీటిమట్టం ఉంది. ఆదివారం ఉదయానికి 99 అడుగులకు చేరే అవకాశం ఉంది. తొండంగి, శంఖవరం మండలాల తహసీల్దార్లకు పరిస్థితి వివరించాము. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.