
హోరాహోరీగా అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు
నేడు ముగింపు, బహుమతుల ప్రదానం
తుని రూరల్: అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. శ్రీప్రకాష్ విద్యా సంస్థలలో ఇవి నిర్వహిస్తున్నారు. ఆదివారం రెండవ రోజూ సీబీఎస్‌ఈ క్లస్టర్ –7 అంతర్రాష్ట్ర బాలురు, బాలికల అండర్ 14, 17, 19 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 180 జట్లకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్–19 బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని సిస్టర్స్ నివేదిత స్కూల్ (హైదరాబాద్), ద్వితీయ స్థానాన్ని వెరిటాస్ సైనిక్ స్కూల్ (తిరుపతి), తృతీయస్థానాన్ని సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ (ఏలూరు) కై వసం చేసుకున్నట్టు సీబీఎస్‌ఈ పరిశీలకుడు సీహెచ్‌ఎంఎల్.శ్రీనివాసు తెలిపారు. అండర్–14, 17 విభాగాల్లో జట్లు తమ సత్తా చాటి క్వార్టర్ ఫైనల్స్ వైపు దూసుకువెళుతున్నాయన్నారు. వీటి ఫలితాలు సోమవారం వస్తాయని, విజేతలకు అదేరోజు బహుమతుల ప్రదానం జరుగుందన్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, ఆంధ్ర, తెలంగాణాల నుంచి విద్యార్థులు, కోచ్‌లు, మేనేజర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.