
చెట్టుపై నుంచి పడి దింపు కార్మికుడి మృతి
కొత్తపేట: కొబ్బరి కాయల దింపు కోసం చెట్టు ఎక్కిన కార్మికుడు ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామానికి చెందిన కారింకి వీరవెంకట సత్యనారాయణ (పండు) (42) కొబ్బరి దింపు కార్మికుడు. ఆదివారం మధ్యాహ్నం గ్రామంలో కొబ్బరి దింపు కోసం చెట్టు ఎక్కి కింద పడి మృతి చెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాము తెలిపారు.
గ్రామంలో విషాద ఛాయలు
దింపు కార్మికుడు పండు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా రోదించారు. అందరితో కలసిమెలసి ఉంటూ, సహచర దింపు కార్మికులకు అండగా ఉండే పండు మృతి చెందాడని తెలిసి పలువురు గ్రామస్తులు, దింపు కార్మికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేవలం కొబ్బరి దింపులు తీసుకుంటూ జీవనం సాగించే అతని మృతితో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.
అమ్మమ్మ చెంతకు చేరిన బాలిక
సామర్లకోట: వరుసగా మూడురోజుల పాటు సెలవులు రావడంతో ఆయా ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి రైల్వే స్టేషన్, బస్సు కాంప్లెక్స్‌లు ఆదివారం ప్రయాణికులతో నిండి పోయాయి. ఈ తరుణంలో ఆదివారం జోన్నాదుల వెంకటసాయమ్మ తన మనువరాలు జ్యోత్స్నతో కలిసి చీరాలకు వెళ్లడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. టిక్కెట్టు తీసుకొవడానికి కౌంటర్ వద్దకు వెళ్లిన సమయంలో జనంతో కలిసి జ్యోత్స్న ఒకటవ నెంబరు ప్లాటుఫారంపైకి వచ్చింది. అక్కడ అమ్మమ్మ కనిపించక పోవడంతో ఏడుస్తూ ఉండటాన్ని స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ అనంత లక్ష్మీ గమనించారు. రైల్వే స్టేషన్‌లోని మైక్ ద్వారా ప్రకటించారు. అప్పటికే టిక్కెటు తీసుకున్న వెంకటసాయమ్మ మనవరాలి కొసం కౌంటర్ వద్ద వెతుకుతూ ఉంది. ఈ తరుణంలో మైక్ ద్వారా సమాచారం రావడంతో ఊపిరి పీల్చుకుని స్టేషన్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లింది. అచ్చట స్టేషన్ మేనేజరు ఎం రమేష్ కౌన్సెలింగ్ చేసి బాలికను ఆర్‌పీఎఫ్ సిబ్బంది సమక్షంలో వెంకటసాయమ్మకు అప్పగించారు.

చెట్టుపై నుంచి పడి దింపు కార్మికుడి మృతి

చెట్టుపై నుంచి పడి దింపు కార్మికుడి మృతి