
మూడు హత్యలకు నిరసనగా శాంతి ర్యాలీ
● నిందితుడికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్
● సీబీఎం సెంటర్‌లో మానవహారం
సామర్లకోట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక భాగంలో ఉన్న సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ఒక వివాహిత, ఇద్దరు బాలికలను దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా ఆదివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు, మానవహక్కుల సంఘ నాయకుల మద్దతుతో స్థానిక సీబీఎం సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ములపర్తి మాధురి (30) కుమార్తెలు పుష్పకుమారి (8), జెస్సీలోన(6)లను హత్య చేసిన విషయం విదితమే. 3వ తేదీ ఉదయం ఇంటికి వచ్చిన మాధురి భర్త ధనుప్రసాద్ హత్య జరిగిన విషయాన్ని గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్పీ ఆదేశాలలో పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడు స్థానిక కోటపేటకు చెందిన తలే సురేష్‌ను ఈ నెల 7వ తేదీన అరెస్టు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించిన విషయం విదితమే. ఇటువంటి మానవమృగాలకు బుద్ధి వచ్చే విధంగా ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ స్థానిక సీబీఎం సెంటర్‌లో పిల్లలు, పెద్దలు, మహిళలతో కలిసి మానవ హారం నిర్వహించారు. దళిత సంఘ నాయకులు పిట్టా జానికిరామారావు, లింగం శివప్రసాద్, జిల్లా మానవహక్కుల సంఘ అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ మాట్లాడుతూ సురేష్ తరఫున ఏ న్యాయవాది వాదించకుండా చూడాలన్నారు. మానసికంగా కృంగి పొయిన ములపర్తి మాధురి భర్త ధనుప్రసాద్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాఽఽధురి తల్లి ఫిర్యాదును కాకుండా భర్త ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని కోర్టు శిక్ష పడే విధంగా చూడాలన్నారు. సుమారు 30 నిమిషాల పాటు సీబీఎం సెంటర్‌లో మానవ హారం నిర్వహించడంతో నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ స్తంభించింది. అక్కడి నుంచి పోలీసు స్టేషన్ మీదుగా సంతమార్కెట్, పాత తహసీల్దార్ కార్యాలయం, బ్రౌన్‌పేట సెంటర్ నుంచి తిరిగి సీబీఎం సెంటర్ వరకు శాంతి ర్యాలీ చేరింది. సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దళిత సంఘ నాయకులు జుత్తుక అప్పారావు, పాలిక చంటి బాబు బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.