
స్నానానికి వెళ్లి అనంతలోకాలకు..
రాజమహేంద్రవరం రూరల్: స్నేహితులతో కలిసి గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బొమ్మూరు రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన ఊట వంశీకృష్ణ(18) శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి పుష్కరాలరేవులో గోదావరి స్నానానికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ మురళీకృష్ణ మునిగిపోయాడు. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం 10.00 గంటల సమయంలో కుమారి టాకీస్ సమీపంలో దోభీఘాట్ వద్ద మురళీకృష్ణ మృతదేహం లభించింది. టుటౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై అశ్వక్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.
ఉన్నత చదువులు చదువుతాడని...
మురళీకృష్ణ తండ్రి శ్రీను ఎస్‌వీజీ మార్కెట్‌లో జట్టుకూలీగా పనిచేస్తుంటాడు. తనలాగా తన కొడుకు ఉండకూడదని మురళీకృష్ణను స్థానికంగా ఉన్న ప్రైవేటు జూనియర్ కాలేజీలో జాయిన్‌చేసి చదివిస్తున్నాడు. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్నాడు. బాగా చదువుకుని ఉన్నతస్థాయికి వెళతావనుకుంటే మా అందరిని వదిలేసి వెళ్లిపోయావేంటి వంశీ అంటూ శ్రీను దంపతులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది.