
ఉద్యోగాల్లో రెండు నెలలుగా!
పిఠాపురం: పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీలలో బదిలీల జీఓ అమలు కావడం లేదు. దీంతో రెండు నెలలకు పైగా ఇతర ప్రాంతాల నుంచి బదిలీలపై వచ్చిన ఆరుగురు మున్సిపల్ ఉద్యోగులు జీతాలు రాక గాల్లో చక్కర్లు కొడుతున్నారు. వారి బదిలీల జీఓను వెంటనే అమలు చేయాలని సీడీఎంఏ పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్‌కు మెమో ఇచ్చినా వారిలో చలనం లేకపోవడంతో రెండు నెలలుగా జీతాలు లేక ఉద్యోగులు అలమటిస్తున్నారు. గత జూన్ 9వ తేదీన సాధారణ బదిలీల్లో భాగంగా పిఠాపురం మున్సిపాలిటీకి ముగ్గురు, గొల్లప్రోలు నగర పంచాయతీకి ముగ్గురు తుని, సామర్లకోట మున్సిపాలిటీల నుంచి బదిలీపై వచ్చారు. కానీ పిఠాపురం మున్సిపల్ కమిషనర్ వీరిని చేర్చుకోలేదు. అప్పటి నుంచి నియామక ఉత్తర్వుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీలలో ఎవరినీ చేర్చుకోవద్దని కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయని కమిషనర్ కనకారావు వీరిని చేర్చుకోవడానికి నిరాక రించారు. దీంతో వీరు మున్సిపల్ ఆర్డీ, సీడీఎంఏ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారులు పలు మార్లు ఈ ఉద్యోగులను చేర్చుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. అయినా కమిషనర్ తీసుకోవడంలేదని ఆ ఉద్యోగులు చెప్తున్నారు. మళ్లీ సీడీఎంఏకు ఫిర్యాదు చేయగా వీడియో కాన్ఫరెన్సులో తమను చేర్చుకోవాలని ఆదేశించినా పట్టించుకోవడం లేదని, తమపై లేనిపోని ఆరోపణలు చూపిస్తూ చేర్చుకోవడానికి విముఖత చూపుతున్నారని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా పిఠాపురం మున్సిపాలిటీకి, గొల్లప్రోలు నగర పంచాయతీలలో పని చేస్తూ ఐదేళ్లు పూర్తి చేసుకుని బదిలీలకు దరఖాస్తులు చేసుకున్న ఐదుగురిని ఇక్కడి నుంచి రిలీవ్ చేయక పోవడంతో ఆ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో ఒక ప్రత్యేక రాజ్యాంగం నడుస్తున్నట్టు ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా ఇలా ఉద్యోగులను కావాలని ఏడిపిస్తున్న మున్సిపల్ కమిషనర్ తీరును పలువురు రాజకీయ నాయకులు, పట్టణ వాసులు దుయ్యబడుతున్నారు.
చేర్చుకోరు.. పనివ్వరు.. జీతం లేదు..
పిఠాపురం, గొల్లప్రోలు
మున్సిపల్ ఉద్యోగుల అగచాట్లు
మెమో ఇచ్చినా మార్పు రాని
మున్సిపల్ కమిషనర్