
సీతారామ సత్రం పరిశీలన
అన్నవరం: రత్నగిరిపై శిథిలావస్థకు చేరిన శ్రీ సీతారామ సత్రాన్ని జేఎన్‌టీయూ ప్రొఫెసర్లు బుధవారం పరిశీలించారు. గతంలో ఈ సత్రాన్ని కూల్చివేయాలని వారు సూచించడం, కాదు.. మరమ్మతులు చేస్తే సరిపోతుందని దేవదాయ సలహాదారు సిఫార్సు చేయడం.. దీనిపై వివాదం నెలకొన్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 26న ‘సాక్షి’లో ‘సత్యదేవ చూడవయ్యా’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్ షణ్మోహన్, దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ సత్రాన్ని జేఎన్‌టీయూకే బృందం మళ్లీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వారి నివేదిక ఆధారంగా కొత్త సత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు వర్సిటీ ప్రొఫెసర్లు వి.రవీంద్ర, జి.ఏసురత్నంతో కూడిన బృందం సత్రాన్ని పరిశీలించి అనంతరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ వి.రామకృష్ణతో చర్చించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు.
టెండర్ ఖరారై మూడు నెలలైనా..
రూ.11.40 కోట్ల వ్యయంతో తొలి దశలో నాలుగు అంతస్తులలో 105 గదులతో సత్రం నిర్మాణానికి టెండర్లు పిలవగా దాదాపు 16 శాతం లెస్‌కు టెండర్లు ఖరారయ్యాయి. ఇది జరిగి మూడు నెలలైనా సత్రం ఎక్కడ నిర్మించాలన్న స్పష్టత లేక పనులు ప్రారంభం కాలేదు.
దరఖాస్తుల ఆహ్వానం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల విద్యాశాఖ జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనపరచిన పాఠశాలల నుంచి స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ బుధవారం తెలిపారు. జిల్లా నుంచి 5 పాఠశాలలకు ఈ అవార్డులు అందిస్తామన్నారు. 2025 సంవత్సరంలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొన్న క్రీడాకారుల సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలపై పాఠశాల హెచ్‌ఎం, పీడీ సంతంకం చేసి ఈ నెల 18వ తేదీ లోపు కాకినాడలోని ఎస్‌జీఎఫ్‌ఐ కార్యాలయంలో కార్యదర్శి ఎల్.జార్జికి అందజేయాలని కోరారు.
అక్షరాంధ్రపై శిక్షణ
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒకరోజు శిక్షణ తరగతి నిర్వహించారు. జిల్లా వయోజన విద్య శాఖ ఉపసంచాలకుడు పసుపులేటి పోశయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి తదితరులు హాజరై నూరు శాతం అక్షరాస్యత సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.