
మహాత్ముడు నడయాడిన గాంధీ చౌక్!
సామర్లకోట: స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా మహాత్మ గాంధీ సామర్లకోటలో పర్యటించడంతో ఆ ప్రాంతానికి గాంధీచౌక్‌గా నామకరణం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంపై ప్రజలను చైతన్యపరచడానికి ఆయన రైలులో సామర్లకోట వచ్చారు. ఇంజిన్‌లో బొగ్గు నింపడానికి గంట సమయం అవసరం కావడంతో రైలును నిలిపివేశారు. రైలులో గాంధీజీ ఉన్నారని తెలుసుకున్న స్థానికులు వెళ్లి ఆయనను కలుసుకున్నారు. ఐక్యతతో శాంతియుతం ఉద్యమాలు చేయాలని ఆయన వారికి పిలుపు నిచ్చారని. ఇతరులకు సాయం చేయాలని గాంధీజీ చెప్పిన మాటలను స్థానికులు మేకా వీర్రాజు, చుండ్రు గొల్లబ్బాయి, యార్లగడ్డ గోవిందులు సాక్షికి తెలిపారు. గాంధీజీ మరణం తరువాత పేదలకు అంబలి పోయడం ప్రారంభించామని చెప్పారు. రైలులో గాంధీ దిగిన ప్రాంతానికి గాంధీచౌక్‌గా నామకరణం చేసినట్టు తెలిపారు. గాంధీజీ మరణాంతరం ఆ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా కాకినాడ మున్సిపాలిటీ అభ్యంతరం తెలిపారని, అయితే అప్పట్లో ప్రముఖ సామాజికవేత్త, దివంగత సమయం వీర్రాజు పోత్సాహంతో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించి వందో జయంతి వరకు స్థానికులకు అంబలి పోసినట్టు గాంధీ యువజన సంఘం నాయకులు తెలిపారు. రైల్వే పట్టాల సమీపంలో ఏర్పాటు చేసిన తాటాకు పాక నేటికీ ఉంది. పాక సమీపంలోనే ఉండే గాంధీ విగ్రహాన్ని సెంటర్‌లో ఏర్పాటు చేశారు. ఇటీవల పాత విగ్రహం స్థానంలో నూతన కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు.