
‘పంపా’ పరవళ్లు
అన్నవరం: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నవరంలోని ‘పంపా’ రిజర్వాయర్‌కు భారీగా వాననీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 94 అడుగులకు చేరింది. పంపా క్యాచ్‌మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రిజర్వాయర్‌లోకి 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. గురువారం ఉదయానికి పంపా నీటిమట్టం 95 అడుగులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పంపా ఆయకట్టుకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సబ్సిడరీ డ్యామ్ ద్వారా పది క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పంపా రిజర్వాయర్ గరిష్ట నీటి నిల్వ 0.43 టీఎంసీ కాగా, ప్రస్తుతం 0.24 టీఎంసీ నిల్వ ఉందని అధికారులు తెలిపారు. గత నెల 26న పంపా నీటిని ఆయకట్టుకు విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పుడు నీటిమట్టం 94 అడుగులు ఉంది. అయితే అప్పటి నుంచి వర్షాలు లేకపోవడం, రిజర్వాయర్ నీటిని ఆయకట్టుకు విడుదల చేయడంతో నీటిమట్టం రోజు రోజుకీ తగ్గుతూ వచ్చింది. మంగళవారం పంపా నీటిమట్టం 92 అడుగులకు పడిపోయింది. మంగళవారం నుంచి పంపా క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నీటిమట్టం మళ్లీ 94 అడుగులకు చేరింది.
94 అడుగులకు చేరిన నీటిమట్టం