
పోరాటాల కల్పవల్లి కొత్తపల్లి
పిఠాపురం: స్వాతంత్య్రం వచ్చెనెని సభలే చేసి.. సంబరపడగానే సరిపోదోయీ.. సాధించిన దానికి సంతృప్తిని పొంది.. అదే విజయమనుకుంటే పొరపాటోయీ.. అని దేశ శృంఖలాలు విడివడిన తొలినాళ్లలోనే ఎందరో అభ్యుదయ కవులు ఇటువంటి ఎన్నో దేశభక్తి గేయాలకు పదాలు కూర్చారు. ఎందరో మహానుభావుల త్యాగాలతో సాధించుకున్న స్వరాజ్యాన్ని ప్రతి భారతీయుడు నరనరానా జీర్ణించుకోవాలి. చేసే ప్రతి పనిలో జాతీయభావాన్ని నింపుకొని జాతి ఔన్నత్యానికి కృషి చేయాలి. అప్పుడే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు విలువ. రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
స్ఫూర్తి రగిలించిన ‘చల్లా’
ఆస్తులున్నా ఆనందంగా జీవించే స్వాతంత్య్రం లేనప్పుడు అవి అనుభవించే అర్హత మనకు లేదంటూ దేశం కోసం తృణప్రాయంగా త్యాగం చేసిన చిరస్మరణీయులలో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు చల్లా నారాయణమూర్తి ఒకరు. ఈయన 1911–2003 మధ్య కాలంలో జీవించిన ఆయన ఆంగ్లేయుల పాలనను తీవ్రంగా వ్యతిరేకించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్రాన్ని స్వీకరించారు. అలహాబాద్‌లో కాంగ్రెస్ సేవాదళ్ సహాయ కార్యదర్శిగా కూడా ఆయన పని చేశారు. స్వాతంత్య్రోద్యమానికి హిందీ భాష అవసరం కావడంతో జవహర్‌లాల్ నెహ్రూ సతీమణి కమలా నెహ్రూ వద్ద ఆ భాషను నేర్చుకున్నారు. అంతే కాకుండా గోండా జైలులో లాల్‌బహుదూర్‌శాస్త్రితో కలిసి 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని శిక్షలు అనుభవించారు. జవహర్‌లాల్ నెహ్రూ, కేడీ మాలవ్య, ఉమాశంకర్ దీక్షిత్, టంగుటూరి ప్రకాశంపంతులు, పొట్టి శ్రీరాములు, మల్లిపూడి పళ్లంరాజు మొదలైన వారితో సత్సంబంధాలు ఉండేవి. మహాత్మగాంధీ వంటి జాతీయ నాయకులతో కలిసి పది రోజుల పాటు తీహార్ జైలులో గడిపారు. మద్దూరి అన్నపూర్ణయ్యతో కలిసి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యంలో పాల్గొన్నారు. పీయూసీ వరకు చదివిన ఆయన వివిధ భాషల్లో మంచి ప్రావీణ్యం పొందారు. తాటిపర్తి గ్రామానికి ఆయన తొలి సర్పంచ్‌గా పని చేసి గ్రాామాన్ని విద్యుత్ వెలుగులతో నింపారు. గొల్లప్రోలు కో ఆపరేటివ్ సొసైటీకి అద్యక్షుడుగా పని చేశారు.
అస్పృశ్యత నిర్మూలనకు కృషి
కుల మతాలకు అతీతంగా ఆయన వ్యవహరించేవారు. నిమ్న కులాలను ఎంతో ఆదరించి, విద్యాబుద్ధులు నేర్పేవారు. ఆయన వద్ద విద్యనభ్యసించిన ఎందరో నేడు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు.
ఆస్తంతా అర్పించి.. అవస్థలు
నారాయణమూర్తి పెద్ద భూస్వామిగా పేరొందారు. స్వాతంత్య్ర పోరాటంలో తనకు ఉన్న 150 ఎకరాల భూమిని నగదు, ఆభరణాలను అర్పించారు. తన కుటుంబ పోషణను కూడా లెక్క చేయకుండా కేవలం స్వాతంత్య్ర సమరం కోసం మొత్తం సమర్పించారు. ఆయనకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ పట్టణాల్లో జీవిస్తున్నారు. 2003లో ఆయన కన్నుమూసేనాటికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిల్లల పెళ్లిళ్లు చేయలేని స్థితి ఏర్పడింది. క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమర యోధులకు క్రాంతి మైదాన్ పేరిట అప్పటి కలెక్టర్ సతీష్ చంద్ర, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోన్‌రావు తదితరులు ఆయనను సత్కరించారు. తాటిపర్తిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జీవిత చరిత్రను ప్రస్తుత జనాలకు తెలిసేలా శిలాఫలకం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ తొలి సమావేశంలో ఆయన జైలు జీవితం అనుభవించినట్లుగా తొలి తీర్మానం చేశారు.
ఆదరిస్తామన్నా తిరస్కరించి..
ఆయన చివరి రోజుల్లో ప్రభుత్వ ఆదరణ అవకాశాన్ని సైతం ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను ఏదో సంపాదించుకోవాలని పోరాటం చేయలేదని ఉన్నదాని కంటే స్వాతంత్య్రం వచ్చిందన్న సంతృప్తే నాకు కోట్ల ఆస్తితో సమానమని పేర్కొన్నారు. దీంతో ఆయనను సన్మానించి అధికారులు వెనుదిరిగారు.
మన తెలుగునేల ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు. చరిత్రకారులకు జన్మస్థలమైన కొత్తపల్లి అలనాటి వైభవాన్ని నేటికీ చాటిచెబుతోంది. ఎక్కడ చూసినా చరిత్ర ఆనవాళ్లు దర్శనమిస్తుంటాయి. స్వాతంత్య్ర ఉద్యమం తొలినాళ్లలో అప్పటి పిఠాపురం తాలూకాలో కొత్తపల్లి ఫిర్కాకు ప్రత్యేక స్థానం వుంది. ఎందరో చరిత్రకారులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజవంశీయుల పుట్టినిల్లు కొత్తపల్లి. పిఠాపురం తాలూకాలో ఐదు వేల జనాభాతో అతిపెద్ద గ్రామంగా విరాజిల్లింది. దివ్య క్షేత్రంగాను, కళా కేంద్రంగాను, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయంగా, సాహితీ మందిరంగా రాజకీయ చైతన్యానికి ఆలవాలంగా చరిత్ర పుటలకెక్కింది. రావు అచ్చియ్యరావు, పుత్సల సత్యనారాయణ, రావు వెంకట జగ్గారావు, అల్లిక సన్యాసయ్య, జ్యోతుల కాశీస్వామి, జ్యోతుల శేషయ్య, చిట్టాడ చిన్న ముత్యాలు వంటి ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు కొత్తపల్లిలో జన్మించి దేశ అభ్యుదయానికి తమ వంతు కృషి చేశారు. నాటి కొత్తపల్లి రాజకీయ కారణాలతో వాకతిప్ప, కుతుకుడుమిల్లి, కొత్తపల్లిగా విడిపోయింది. కాకతీయుల ఘనతను చాటి చెప్పిన రావు వారి వంశం ఈ గ్రామంలోనే అధిక శాతం నివసించారు.. నివసిస్తున్నారు. ఆయుర్వేద వైద్యానికి, వస్త్ర పరిశ్రమలకు నిలయమై, స్వాతంత్య్ర సమరం, ఉప్పు సత్యగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఖద్దరు ప్రచారం, హరిజనోద్ధరణ కార్యక్రమాలకు కొత్తపల్లి వేదికై ంది. బులుసు సాంబమూర్తి సారధ్యంలో కొత్తపల్లిలో ప్రధమ రాజకీయ మహాసభ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ మహాసభ కొత్తపల్లి చరిత్రలో కలికితురాయి. ఆ సమయంలోనే స్థానికులు విదేశీ వస్త్రాలను గుట్టలుగా పోసి తగులబెట్టారు. దీంతో వారిపై అక్రమ కేసులు బనాయించినా పిఠాపురం తాలూకా పరిధిలో సాక్ష్యం చెప్పేవారు లేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహా సభకు నాయకులు కొత్తపల్లి నుంచే భారీ సన్నాహాలు చేశారు. మహాత్మ గాంధీ, పండిట్ నెహ్రూ, జయప్రకాష్ నారాయణ, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు ఎందరో ఇక్కడ సందేశాలిచ్చి ప్రజలను చైతన్యపరిచారు. సద్గ్రంథాలు, సన్మిత్రులవలే సహృదయ శాసనాలు కావిస్తాయని నమ్మిన అప్పటి స్వాతంత్య్ర సమర యోధులు రావు అచ్చియ్యరావు తన స్వగ్రామం కొత్తపల్లిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. టౌన్ హాల్‌గా పిలిచే ఆ గ్రంథాలయంలో రాజకీయ, సామాజిక, స్వాతంత్య్ర సంగ్రామం గ్రంథాలను ఏర్పాటు చేశారు. దీనిని విజ్ఞాన మందిరంగాను, కళా కేంద్రంగా రూపొందించారు. సభలు, సమావేశాలు, విద్యాగోష్టులు, నిర్వహించడంతో ఈ గ్రంథాలయానికి ఎంతో ప్రాచీనత సంతరించుకుంది.
స్వాతంత్య్ర సమరయోధుల వైద్య సేవల కోసం సుమారు 118 ఏళ్ల చరిత్ర గలిగిన కొత్తపల్లిలోని శ్రీలక్ష్మి గణపతి ఆయుర్వేద నిలయం ఎంతగానో తోడ్పడేది. విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కొత్తపల్లిలో ఖద్దరు తయారీ కేంద్రాలను నెలకొల్పారు. అదే నేడు కొత్తపల్లికి ఘన కీర్తిని తెచ్చిపెట్టింది. ఉప్పు సత్యాగ్రహం సమయంలో అప్పట్లో ఉప్పువాడగా పేరొందిన ప్రస్తుతం ఉప్పాడను పలువురు స్వాతంత్య్ర సమరయోధులు సందర్శించి నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
స్వాతంత్య్ర ఉద్యమ దివిటీలెన్నెన్నో..
పల్లెపల్లెలో రగిలిన పోరాట స్ఫూర్తి
మహనీయుల త్యాగాలు..
చరితలతో నిండిన నేల
త్రివర్ణ పతాక రెపరెపల వేళ..
త్యాగధనుల సంస్మరణలివి

పోరాటాల కల్పవల్లి కొత్తపల్లి

పోరాటాల కల్పవల్లి కొత్తపల్లి

పోరాటాల కల్పవల్లి కొత్తపల్లి

పోరాటాల కల్పవల్లి కొత్తపల్లి

పోరాటాల కల్పవల్లి కొత్తపల్లి

పోరాటాల కల్పవల్లి కొత్తపల్లి