
కొన ఊపిరికి కొత్త ఊపిరి
కపిలేశ్వరపురం: ఆలోచన అయినా ఆచరణ అయినా బొందిలో ప్రాణం ఉన్నంత వరకే. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు తీసుకొన్న సామాజిక అవగాహనతో కూడిన నిర్ణయాలు మరణించిన వ్యక్తిని మరెన్నో తరాలు జీవించేలా చేస్తాయి. అలాంటి కోవలోకి వచ్చే అవయవదానం సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతోమంది తమ అవయవాలను దానం చేసి ఎంతోమందికి ప్రాణం పోశారు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈ కథనం...
పెరిగిన అవసరం
భారతదేశంలో అవయవాలు సకాలంలో అందుబాటులో లేక రోజుకు 20 మంది చొప్పున చనిపోతున్నారని అంచనా ఉంది. ప్రతి పది నిమిషాలకు ఒకరు అవయవ మార్పిడి చేయించుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉంది. అవయవాలు అవసరమైన వారిలో పది శాతం మందికి కూడా అవి లభ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అవయవదానం ప్రాధాన్యం పెరిగింది. సాహితీవేత్తలు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు మరణానంతరం తమ దేహాలను దానం చేస్తూ అంగీకార పత్రాలను రాసిన చరిత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి ఉంది.
చేయడం ఇలా.. : దాతలు జీవిస్తూనే వారి అవయవాలలో కొంత భాగాన్ని దానం చేస్తూ ఇతరులకు ఊపిరి పోస్తున్నారు. రక్తాన్ని, 50 శాతం కాలేయాన్ని, రెండింటిలో ఒక కిడ్నీని ఇతరులకు దానం చేయడం ఈ కోవలోనివే. మరొక పద్ధతిలో వారు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల నిర్ణయంతో అవయవాలు దానం చేస్తున్నారు. బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తుల్లో మొత్తం రెండు కిడ్నీలను, గుండెను, కాలేయాన్ని, ఊపిరితిత్తులను, ప్యాంక్రియాసిస్ గ్రంధిని వాటి పనితీరు సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు దానం చేస్తున్నారు. తన దేహాన్ని మరణానంతరం వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధన కోసం కళాశాలకు అప్పగించాలంటూ కొందరు ముందస్తు ఒప్పంద పత్రాన్ని రాస్తున్నారు. సహజ మరణం పొందిన వారి నుంచి కార్నియా, చర్మం, ఎముక, గుండె కవాటాలు, రక్తనాళాలు దానం చేసే వీలు ఉంది.
చిరంజీవులయ్యారు
మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు కాకర శ్రీనివాసరావు ఈ ఏడాది జూలై 12న గుండెపోటుతో మృతిచెందగా ఆయన నేత్రాలను అనపర్తి రాధాకృష్ణ ఐ బ్యాంక్‌కు దానం చేశారు. తాళ్ళరేవు మండలం పి.మల్లవరం గ్రామానికి చెందిన ధూలిపూడి సీతారాం అనే మహిళ ఈ ఏడాది జులై 1న గుండెపోటుతో మరణించగా నేత్రదానం చేశారు. తాళ్లరేవు మండలం వూడా హిమావతి ఈ ఏడాది జనవరి 26న గుండెపోటుతో మరణించడంతో రెండు నేత్రాలను కాకినాడ బాదం ఐ బ్యాంక్‌కు దానం చేశారు. ద్రాక్షారామ పద్మ స్టూడియో అధినేత కె.వీర్రాజు ఈ ఏడాది మే 28న మృతి చెందగా కాకినాడ రెడ్ క్రాస్ ఐ బ్యాంకుకు రెండు కార్నియాలను దానం చేశారు. కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన పలపకూర వెంకట్రావు ఏడాది ఏప్రిల్ 26న గుండెపోటుతో మరణించగా కాకినాడ రెడ్ క్రాస్ ఐ బ్యాంకుకు రెండు కార్నియాలను దానం చేశారు. కె.గంగవరం గ్రామానికి చెందిన చింత చిన్నారి ఈ ఏడాది ఫిబ్రవరి 27న మృతి చెందగా రెండు నేత్రాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానం చేశారు.
ధన్య చరితులు.. పుణ్యమూర్తులు
వారి త్యాగం చైతన్యానికి ప్రతీక
కన్ను మూస్తూ..
మరొకరికి జన్మనిస్తున్న దాతలు
నేడు ప్రపంచ
అవయవదాన దినోత్సవం
బ్రెయిన్ డెత్ కావడంతో...
మండపేట మండలం ద్వారపూడి గ్రామానికి చెందిన యువకుడు నున్న శివన్నారాయణ (శివ) ఈ ఏడాది మే 25న రాజమహేంద్రవరం – ద్వారపూడి రహదారిలో ప్రమాదానికి గురికావడంతో బ్రెయిన్ డెత్ అయ్యింది. కుటుంబ సభ్యుల నిర్ణయంతో కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రిలో అతని అవయవాలను దానం చేయడం ద్వారా ముగ్గురికి జీవితాన్ని ప్రసాదించాడు. లివరు, ఒక కిడ్నీని ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి, మరో కిడ్నీని విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అమర్చారు. రెండు నేత్రాలలోని కార్నియాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్‌కు దానం చేశారు.
నాన్న స్ఫూర్తితో దేహదానం చేశాం
నాన్న మానవ సమాజం పట్ల అవగాహనతో జీవించారు. నా చిన్ననాటి నుంచీ అనేక విషయాలు బోధించారు. ఆయనతో పాటు అమ్మకు అవగాహన కల్పించి ఆమె దేహాన్ని కూడా దానం చేసేందుకు చైతన్య పర్చారు. ఆ స్ఫూర్తితో నేను, నా జీవిత భాగస్వామి కల్యాణి కూడా దేహదానం చేసేందుకు పత్రం రాశాం.
– మేకా గౌరవ్, పిఠాపురం, కాకినాడ జిల్లా
వైద్య విద్యార్థుల పరిశోధన లక్ష్యంగా..
కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, ఆలయ శిల్పి పెద్దింశెట్టి సూర్యనారాయణమూర్తి (91) 2021 డిసెంబర్ 8న వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆయన జీవించి ఉండగానే 2009 నవంబర్ 22న కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు దేహదాన ఒప్పంద పత్రాన్ని రాసి ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఆ మేరకు సూర్య నారాయణమూర్తి దేహాన్ని కళాశాలకు అప్పగించారు. పిఠాపురానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, వజ్రాయుధం పుస్తక రచయిత ఆవంత్స సోమసుందర్ 2016 ఆగస్టు 12న వృద్ధాప్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు దేహాన్ని అప్పగించారు. పిఠాపురం పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) తానూ, తన భార్య అనూరాధ ఇద్దరూ తమ దేహాలను వైద్య కళాశాలకు రాసి ఇచ్చారు. కాగా 2022 ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే రోజున సత్యనారాయణశాస్త్రి గుండెపోటుతో మరణించగా కుటుంబ సభ్యులు రాజానగరం జీఎస్‌ఎల్ కళాశాలకు దేహాన్ని అప్పగించారు. ఆ స్ఫూర్తితో అదేరోజు సత్యనారాయణ శాస్త్రి కుమారు డు గౌరవ్, కోడలు కల్యాణిలు తమ దేహాలను దానం చేసేందుకు ఒప్పంద పత్రాలను రాసి ఇచ్చారు.

కొన ఊపిరికి కొత్త ఊపిరి