రంగస్థలంపై సానా పంతం! | - | Sakshi
Sakshi News home page

రంగస్థలంపై సానా పంతం!

Aug 12 2025 7:39 AM | Updated on Aug 13 2025 5:40 AM

రంగస్

రంగస్థలంపై సానా పంతం!

పొరుగువారు హాజరు..

ఇరుగు వారే రాలేదు!

జనసేన ఎమ్మెల్యే నానాజీతో పాటు టీడీపీ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా ఈ కార్యక్రమానికి దూరంగానే ఉన్నారు. వాస్తవానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి సతీష్‌తో ఉప్పు, నిప్పుగా ఉంటున్నారు. ఎన్నికల ముందు నుంచి ఏ పార్టీలో చేరకుండా స్వచ్ఛంద సంస్థ పేరుతో కాకినాడ సిటీలో కార్యక్రమాలు చేస్తూ, తన వర్గీయులతో టచ్‌లో ఉంటున్నారనే సమాచారం తెలియడంతో కొండబాబుకు సతీష్‌ పొడ గిట్టలేదు. సిటీ నియోజకవర్గ పరిధిలో లేకున్నప్పటికీ ఆర్‌ఎంసీ గ్రౌండ్‌ సిటీ, రూరల్‌ రెండు నియోజకవర్గాలకే పరిమితం కాదనేది వాస్తవం. పొరుగున ఉన్న పిఠాపురం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌వర్మ హాజరవ్వడం, ఇరుగు,పొరుగున ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు నానాజీ, కొండబాబు పునఃప్రారంభోత్సవానికి హాజరుకాకపోవడంపై కూటమిలో విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఎంత మంది వద్దన్నా లెక్క చేయకుండా రంగరాయ వైద్య కళాశాల గ్రౌండ్‌లో వాకర్స్‌కు బలవంతంగా అనుమతివ్వడమే పెద్ద తప్పు. అటువంటి గ్రౌండ్‌పై ఆధిపత్యం కోసం నిస్సిగ్గుగా ఇప్పుడు కూటమి నేతలు కుమ్ములాడుకోవడంపై మేధావి వర్గం విస్మయం వ్యక్తం చేస్తోంది.

ఆర్‌ఎంసీ క్రీడాప్రాంగణం

ఆర్‌ఎంసీ క్రీడాప్రాంగణం ముఖద్వారం

రంగరాయ వైద్య కళాశాల గ్రౌండ్‌పై

పెత్తనం వెనుక దూరాలోచన

ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు

గ్రౌండ్‌లో వాకర్స్‌కు

అనుమతిపై పలువురి ఆక్షేపణ

ఇద్దరు ఎమ్మెల్యేల గైర్హాజరుపై చర్చ

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రంగరాయ వైద్య కళాశాల గ్రౌండ్‌లో కూటమి నేతలు రాజకీయ కుస్తీలకు సై అంటున్నారు. ఆరు దశాబ్దాల పైబడి చరిత్ర కలిగిన రంగరాయ వైద్యకళాశాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అందుకే దేశంలోని పలు రాష్ట్రాల విద్యార్థులు ఆర్‌ఎంసీలో సీటు వచ్చిందంటే చాలా సంబర పడతారు. ఎంబీబీఎస్‌, పీజీ, పారా మెడికల్‌ కోర్సులు కలిపి సుమారు 2,000 మంది విద్యార్థులకు సరస్వతి నిలయంగా ఆర్‌ఎంసీ విరాజిల్లుతోంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఆర్‌ఎంసీని కూటమి నేతలు రాజకీయ వేదికగా మార్చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆధిపత్యం కోసం ఆర్‌ఎంసీని పావుగా వాడుకుంటున్నారని మెడికోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌ఎంసీలో విద్యార్థుల కోసం ఉన్న 14 ఎకరాల విశాలమైన ఆటస్థలంలో బయటి వ్యక్తులను వాకింగ్‌ ట్రాక్‌ కోసం అనుమతించడంపై కూటమి నేతల మధ్య వార్‌ నడుస్తోంది.

వాకర్స్‌కు మళ్లీ అనుమతిపై వ్యతిరేకత

ఆర్‌ఎంసీలోని అన్ని విభాగాలకు చెందిన వైద్య విద్యార్థుల కోసం ఏర్పాటైన ఈ గ్రౌండ్‌లో బయట వ్యక్తులు చొరబడి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ గ్రౌండ్‌లో ఆటలాడుకునే వైద్య విద్యార్థినులకు రౌడీమూకల నుంచి వేధింపులు ఎక్కువవ్వడంతో మెడికోలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వారిని అనుమతించవద్దని విద్యార్థుల డిమాండ్‌పై కాకినాడ రూరల్‌ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులను వెంటేసుకుని గ్రౌండ్‌కు వెళ్లి నానా రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యే నానాజీ ఆర్‌ఎంసీ స్సోర్ట్స్‌ ఇన్‌చార్జి, ఫోరెన్సిక్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై చేయిచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. అప్పట్లో కూటమి పెద్దలు జోక్యం చేసుకుని జిల్లా అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చి నానాజీతో డాక్టర్‌ ఉమామహేశ్వరరావుకు క్షమాపణ చెప్పడంతో సమస్యను సర్దుబాటు చేయడం తెలిసిందే. ఇంత రాద్ధాంతం జరిగినా రెండురోజుల క్రితం ఆర్‌ఎంసీ గ్రౌండ్స్‌లో వాకర్స్‌ను కొన్ని షరతులకు లోబడి తిరిగి అనుమతించడాన్ని దాదాపు అన్ని వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. అదీ కూడా అధికారాన్ని ఉపయోగించి ఉన్నత స్థాయి నుంచి జిల్లా యంత్రాంగం, ఆర్‌ఎంసీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ అనుకున్నది సాధించుకున్నారు.

ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వైరుధ్యాలు?

గ్రౌండ్స్‌లో వాకర్స్‌ను అనుమతించే వరకు పట్టువదలని విక్రమార్కులు మాదిరి కలిసి పనిచేసిన జనసేన ఎమ్మెల్యే నానాజీ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌బాబు మధ్య వైరుధ్యాలు పొడచూపాయని కూటమి నేతల మధ్య చర్చ నడుస్తోంది. గ్రౌండ్‌లో వాకర్స్‌కు అనుమతి సాధించడం వెనుక కృషి, క్రెడిట్‌ తమ నేతదంటే తమ నేతదంటూ పంతం, సతీష్‌ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. గ్రౌండ్‌లో వాకర్స్‌ను అనుమతించక పోవడంపై ఫ్రొఫెసర్‌ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడిన ఉదంతంతో రాష్ట్ర స్థాయిలో తమ నాయకుడు అప్రతిష్టపాలయ్యారని నానాజీ వర్గీయులు పేర్కొంటున్నారు. తమ నాయకుడు పట్టుబట్టి సాధిస్తే మధ్యలో వచ్చి ఆ క్రెడిట్‌ను ఎంపీ సతీష్‌బాబు ఎగరేసుకుపోయారని నానాజీ వర్గం మండిపడుతోంది. ఆర్‌ఎంసీ గ్రౌండ్స్‌పై ఆధిపత్యం కోసం అంతలా సతీష్‌బాబు తాపత్రయపడటం వెనుక దూరదృష్టి లేకపోలేదంటున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లను క్రికెట్‌ అభిమానులు తిలకించేందుకు ఫ్యాన్‌పార్క్‌లు ఇప్పటి వరకు మెట్రోపాలిటిన్‌ సిటీల్లో మాత్రమే అనుమతించే వారు. అటువంటిది కాకినాడ సిటీలో తొలిసారి సతీష్‌ తీసుకురావడం ముందస్తు వ్యూహంలో భాగమేనంటున్నారు. అందునా ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా (ఈ నెల 16న జరగనున్న ఎన్నికలకు సతీష్‌బాబు ఒక్కరే నామినేషన్‌ వేశారు) ఏకగ్రీవం కానున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ (బోర్డు ఆఫ్‌ క్రికెట్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా) నుంచి దండిగా నిధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌కు వార్షిక నిర్వహణ నిధులు రెట్టింపు చేయడం వంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇవన్నీ ఉండబట్టే ఆర్‌ఎంసీ గ్రౌండ్స్‌పై ఆధిపత్య పోరులో సతీష్‌బాబు ముందున్నారని నానాజీ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. ‘వ్రతం చెడినా ఫలం దక్కకే’ వాకర్స్‌ను అనుమతించే కార్యక్రమ పునఃప్రారంభోత్సవానికి తమ నేత డుమ్మా కొట్టారని ఆ వర్గం పేర్కొంటోంది.

రంగస్థలంపై సానా పంతం!1
1/4

రంగస్థలంపై సానా పంతం!

రంగస్థలంపై సానా పంతం!2
2/4

రంగస్థలంపై సానా పంతం!

రంగస్థలంపై సానా పంతం!3
3/4

రంగస్థలంపై సానా పంతం!

రంగస్థలంపై సానా పంతం!4
4/4

రంగస్థలంపై సానా పంతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement