రత్నగిరి.. కిక్కిరిసి..
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరిపై సత్యదేవుని ఆలయం శనివారం కిక్కిరిసిపోయింది. రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధువులతో పాటు ఇతర భక్తులు కూడా సత్యదేవుని దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. తీవ్రమైన రద్దీ కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అంతరాలయ దర్శనం రద్దు చేశారు. సత్యదేవుని 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 5,200 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం వాతావరణం మేఘావృతమై వర్ష సూచనలు ఉండటంతో సత్యదేవుని ప్రాకార సేవ పల్లకీ మీద ఆలయం లోపలి ప్రాకారంలో నిర్వహించారు. సత్యదేవుని సన్నిధిలో ఆదివారం కూడా రద్దీ కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో టేకు రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఊరేగించనున్నారు. రూ.2,500 చెల్లించిన భక్తులు ఈ రథ సేవలో పాల్గొనవచ్చు. ఆ రుసుం చెల్లించిన వారి కుటుంబ సభ్యులు నలుగురికి స్వామివారి అంతరాలయ దర్శనం, ప్రసాదం, వేదాశీర్వచనం, దంపతులకు కండువా, జాకెట్టు ముక్క అందజేస్తారు.
ఫ సత్యదేవుని దర్శించిన 50 వేల మంది
ఫ 5,200 వ్రతాలు
ఫ దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం


