మూడో పంటకు మంగళం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఈ సారి రైతులు మూడో పంటకు మంగళం పాడక తప్పని పరిస్థితి. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చూపించిన ఉదాసీనత రైతులకు శాపమైంది. దెబ్బమీద దెబ్బగా ప్రకృతి కన్నెర్రజేయడంతో తడిసిన ధాన్యాన్ని రబీ రైతులు కళ్లాల్లో ఆరబెట్టుకుని అమ్ముకున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సవాలక్ష సాకులు వెతకడంతో కనీస మద్దతు ధర అందక రైతులు లబోదిబోమంటున్నారు. ఈ పరిణామంతో ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించడానికి రైతులు నానా కష్టాలు పడ్డారు. ఖరీఫ్ చివరిలో వర్షాలు పడడం, పండిన ధాన్యం ఆలస్యంగా కొనుగోలు చేయడంతో రైతులు రబీ పనులు చేసుకునేందుకు అన్నదాత సతమతమవుతున్నాడు. తేమ శాతం వల్ల రైతులు తాము కోసిన వరి పంటను కళ్లాల్లోనే సుమారు 10 నుంచి 15 రోజులు ఉంచేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీని ప్రభావం రబీ సాగు జాప్యానికి కారణమైంది. ఫలితంగా ఈ ఏడాది మూడో పంట అపరాలు వేసే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో రబీ సీజన్‌లో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలనేది జిల్లా వ్యవసాయశాఖ నిర్దేశించిన లక్ష్యం. ముందస్తు ప్రణాళిక ప్రకారం రబీలో నాట్లు డిసెంబరు నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉంటుంది. లక్ష్యాలు నిర్దేశించడంలో చూపుతోన్న శ్రద్ధ వాటిని అధిగమించడంపై పెట్టడం లేదనే పలువురు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రబీ సీజన్ మొదలై నెల దాటిపోతున్నా ఇంత వరకు కనీసం 20 శాతం వరి నాట్లు కూడా పూర్తి కాలేదు. వాస్తవానికి ఈ నెలాఖరు నాటికే నాట్లు పూర్తి కావాల్సి ఉంది.
సాగు నీటి సలహా మండలి సమావేశంలో ఈ ఏడాది రబీ సాగు లక్ష్యాలను నిర్దేశించారు. 2026 మార్చి 31 కల్లా రబీ పంట కాలం పూర్తయ్యేలా నాటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో 1.8 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయాలనేది లక్ష్యం. కానీ అధికారిక లెక్కల ప్రకారం ఇంతవరకు జిల్లాలో కేవలం 23 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. మిగిలిన 1.6 లక్షల ఎకరాల్లో నెలాఖరు నాటికి పూర్తి కావడం సాధ్యం కాదంటున్నారు. వచ్చే జనవరి మూడో వారానికి కూడా పూర్తికాావడం గగనమే అంటున్నారు. ఎప్పటిలాగే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం గొప్పగా సెలవిస్తున్నారు.
ఈ సారి రబీ సన్నాహాలు బాగా ఆలస్యమైపోయాయి. నాట్లు వేసిన దగ్గర నుంచి సుమారు వంద రోజులకు గానీ వరిపంట చేతికి రాదు. రబీ త్వరగా పూర్తయితే మూడో పంటగా రైతులు మినుములు, పెసలు వంటి అపరాలు సాగు చేస్తారు. అపరాలు సాగు అంటేనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుంది. ఒక ఎకరాలో రైతు పెసలు, మినుములు కానీ సాగుచేస్తే మూడు నుంచి నాలుగు బస్తాలు దిగుబడి వస్తుంది. ఎకరాకు కనీసం రెండు, మూడు బస్తాలు పండినా రైతులకు సుమారు రూ.15 వేలు లాభం వచ్చేది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రస్తుత రబీలో అపరాల సాగు దాదాపు లేనట్టే అంటున్నారు. ఖరీఫ్ సీజన్‌లో చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో కుంటిసాకులతో ఈ ఏడాది రబీ మరింత ఆలస్యమవడమే ఇందుకు కారణం. సుమారు నెల రోజుల పైనే రబీ ఆలస్యం కావడంతో జనవరి నెలాఖరుకు కానీ వరినాట్లు పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం జిల్లాలో కాకినాడ రూరల్, కరప, సామర్లకోట, పెద్దాపురం, గండేపల్లి, జగ్గంపేట తదితర మండలాల్లో ఇప్పుడిప్పుడే దమ్ములు చేస్తున్నారు.
రబీ సాగు ఆలస్యం కావడంతో పంట చివర్లో ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీకి నీరు వదిలే సమయంలో గుర్రపు డెక్క తొలగింపు, కాలువల్లో పూడిక తీత పనులంటూ సాగునీరు వదలకుండా నీటిసంఘాల నాయకులు తాత్సారం చేశారు. డిసెంబర్ మూడో వారం నాటికే 70 శాతం రబీనాట్లు పూర్తయ్యేవి. ఈ ఏడాది ప్రభుత్వ నిర్వాకానికి సాగునీరందక రబీ ఆలస్యమవుతోందని రైతులు పేర్కొంటున్నారు. రబీ చివర్లో వరి పంట ఈనిక, పాలు పోసుకునే దశలో నీరందక తప్పతాలు గింజలు మారి, దిగుబడులు తగ్గిపోతాయంటున్నారు. మే నెలలో కూడా రబీ కోతలు పూర్తి కావంటున్నారు. మూడో పంటగా వేసే అపరాలసాగుపై ఆశలు వదులు కోవాల్సిందేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడో పంటను పక్కన పెడితే రబీకై నా పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. సరిగ్గా అదే సమయంలో మార్చి నెలాఖరున గోదావరి కాలువలు మూసివేస్తారు. ఆయకట్టు శివారున ఉన్న పంట పొలాలకు సాగునీటి ఇబ్బందులు తప్పవన్నది రైతుల వాదన. డిసెంబర్ నెలాఖరు లోగా రబీ వరినాట్లు వేసుకుంటే ఫిబ్రవరి నెలాఖరులోగా పంట చేతికి వచ్చేది. ఇలా క్రమ పద్ధతిలో సాగు జరిగి ఉంటే అపరాలు సాగు చేసుకునే అవకాశం దక్కేదని రైతులు చెబుతున్నారు. సాగు జాప్యంతో మూడో పంటగా అపరాల మాట ఎలా ఉన్నా రబీకి కూడా నీరు అందడం కష్టమవుతుందని రైతులు ఇప్పటి నుంచే దిగులు చెందుతున్నారు.
ఏలేరు రైతు కన్నీరు
జిల్లాలోని ఏలేరు సాగునీటి వ్యవస్థపై ఆధారపడ్డ 60 వేల ఎకరాల ఆయకట్టు రైతుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. సాగునీటి వ్యవస్థలో లోపాలతో ఏలేరు పరిధిలో పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో అనుకున్న ప్రకారం రబీ సాగు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. డిసెంబర్ 1 నుంచే రబీ సాగుకు నీరు వదిలినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఎక్కడా సాగు నీరందిన ఆనవాళ్లు కనిపించడం లేదు. కేవలం కాలువల్లో ఊట నీటిని మోటార్ల ద్వారా తోడుకుని అక్కడక్కడా నారుమళ్లు వేశారు తప్ప కాలువ ద్వారా సాగునీరు అందిన దాఖలాలు ఏలేరు పరీవాహక ప్రాంత ఆయకట్టులో ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వ తీరుతో కాలువల ఆధునీకరణ పనులు సక్రమంగా ముందుకు సాగక రబీ సాగుకు ప్రతిబంధకంగా పరిణమించింది. ఏలేరు వంటి ప్రధాన ప్రాజెక్టుకు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో రైతులు ఏటా నష్టపోతూనే ఉన్నా సర్కార్ పట్టించుకోవడం లేదు. గడచిన రెండు సీజన్లుగా ఇదే పునరావృతమవుతోంది. అందుకే వెదజల్లు విధానంలో రబీలో ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
తుపాన్‌తో ఆలస్యం
ఖరీఫ్ సాగు నుంచి వర్షాలు కురియడంతో వరి నాట్లు మునిగిపోయి రెండు పర్యాయాలు నాట్లు వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. పంట చేతికి వచ్చే సమయంతో మోంథా తుపాను పంటను ముంచేసింది. అదే సమయంలో గ్రామం లోని ఏలేరు కాలువలో ఉన్న కాజ్‌వే కొట్టుకుపోవడంతో పంట రవాణాకు అవకాశం లేని పరిస్థితిలో ప్రభుత్వం నుంచి కాజ్‌వే నిర్మాణానికి సహకారం లభించలేదు. దాంతో దాత సహకారంతో కాజ్‌వేను పూర్తి చేసి కోతలు చేసుకున్నాం. దీని వల్ల రబీకి ఆలస్యం అవుతోంది. జనవరిలో పండగ వెళ్లిన తరువాత వరినాట్లు వేస్తాం. గ్రామంలో 30 శాతం మంది నాట్లు వేస్తున్నారు.
– ఇంటి వెంకట్రావు, రైతు, వీకే రాయపురం
ఆలస్యంగా రబీ సాగు
ఈ నెలాఖరు తుది గడువైనా
మూడో వారానికీ 20 శాతమే పూర్తి
1.8 లక్షల ఎకరాల సాగు లక్ష్యం
23 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు


