
రోడ్డెక్కిన ఎండీయూ ఆపరేటర్లు
● వాహనాలతో గడియార స్తంభం వద్ద ధర్నా
● అన్యాయంగా పొట్ట కొట్టారంటూ ఆవేదన
సామర్లకోట: బడుగు, బలహీన వర్గాలలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి గత ప్రభుత్వం ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఎండీయూ వాహనదారులు సోమవారం రోడ్డెక్కారు. జూన్ ఒకటి నుంచి రేషన్ వాహనాలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి ఎండీయూ వాహనాల సైరన్‌తో స్థానిక గడియారం స్తంభం వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఎండీయూ ఆపరేటర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. తమ వాహనాల ద్వారా రేషన్ సరకులు ఇచ్చే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేయడం తమ పొట్ట కొట్టడమేనని ఎండీయు వాహనాల సంఘ అధ్యక్షుడు దర్శిపాటి సత్యానందం ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తరువాత తమతో ఒక సమావేశం ఏర్పాటు చేసి రేషన్ వాహనాలను తొలగిస్తున్నట్లు చెప్పారన్నారు.
అయితే మాకు వాహనాల ద్వారా సరకులు పంపే హక్కు ఫిబ్రవరి 2027 వరకు ఉందని చెప్పామన్నారు. ఎండీయూ వాహనాల ద్వారా సరకులు సరఫరా సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు సరికాదన్నారు. తాము అవకతవకలకు పాల్పడుతున్నట్లు రుజువు అయితే తామే స్వచ్ఛందంగా తొలగిపోతామని చెప్పారు. రేషన్ వినియోగదారులల్లో 78 శాతం మంది వాహనాల ద్వారా సరకులు సరఫరా చేయాలని కొరుకొంటున్నారనే విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వాహనాల రద్దుకు జీఓ చేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని ఎండీయూ వాహన యజమానులు ధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యకూడలి ప్రదేశంలో ఽవాహనాలతో ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.