అల కాంచీపురములో...
● అన్నవరానికి అరుదైన గౌరవం
● కంచి పీఠం ఉత్తరాధికారిగా
గ్రామానికి చెందిన ద్రావిడ్
● 71వ పీఠాధిపతిగా ఎంపిక
● పీఠంతో అన్నవరం దేవస్థానానికి విడదీయలేని బంధం
అన్నవరం: సాక్షాత్తూ ఆ కై లాస శంకరుడే.. ఆదిశంకరాచార్యుడిగా అవతరించి.. అవైదిక మతాల నుంచి సనాతన ధర్మాన్ని పరిరక్షించి.. సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి.. భారత దేశం నలు చెరగులా నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించి.. దక్షిణాదిన తాను స్వయంగా ఆధిపత్యం వహించిన సుప్రసిద్ధ పీఠం.. కంచి కామకోటి పీఠం. అటువంటి విశిష్ట పీఠానికి ఉత్తరాధికారిగా గోదారి గడ్డపై వెలసిన దివ్యక్షేత్రం అన్నవరం గ్రామానికి చెందిన ఓ నవ యువకుడు ఎంపికవడం ఈ ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని నింపుతోంది. అన్నవరానికి చెందిన చతుర్వేద పారంగతుడు దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రావిడ్‌ను కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఎంపిక చేశారు. ద్రావిడ్ ఈ నెల 30న అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా స్వామీజీ చేతుల మీదుగా సన్యాస దీక్ష స్వీకరిస్తారు. అనంతరం ఆయనను స్వామీజీ తన శిష్యునిగా స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో కంచి పీఠంతో అన్నవరం దేవస్థానానికి శతాబ్దానికి పైబడి కొనసాగుతున్న అనుబంధం, కంచి పీఠాధిపతులు గతంలో ఇక్కడకు పలుమార్లు విచ్చేసి, మార్గనిర్దేశం చేయడం వంటి అంశాలను పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ద్రావిడ్ ఎంపికతో కంచి పీఠానికి, అన్నవరం దేవస్థానానికి అనుబంధం మరింత దృఢపడుతుందని, ఇదంతా సత్యదేవుని దయ, పీఠాధిపతులకు ఈ క్షేత్రంపై గల అభిమానమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అన్నవరానికి చెందిన దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రావిడ్ కంచి పీఠం ఉత్తరాధికారిగా, భవిష్యత్తులో 71వ పీఠాధిపతిగా భాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నవరం దేవస్థానంతో పీఠం అనుబంధం మరింత బలోపేతమవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.


