● తిరుప్పావడ వైభవం
ఎటువంటి ఈతి బాధలూ లేకుండా ప్రజలందరూ ఆనందంగా జీవించేలా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ.. తుని మండలం ఎస్.అన్నవరంలో కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం తిరుప్పావడ సేవ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టన్ను పులిహోర (చిత్రాన్నం) తయారు చేసి, స్వామివారి ఆకృతిని రూపొందించారు. ఆ మూర్తికి బూరెలు, పూలు, వెండి ఆభరణాలను విశేషంగా అలంకరించారు. ఆ మూర్తిని వేలాదిగా భక్తులు దర్శించుకుని, పులకించారు. స్వామివారిని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ నిర్వహించిన అన్న సమారాధనలో పాల్గొన్నారు. వైస్ ఎంపీపీ చోడిశెట్టి సత్య నాగేశ్వరరావు, నాయకులు వంగలపూడి జమీలు, వంగలపూడి కృష్ణారావు, పోతుల రమేష్, సకురు నాగేంద్ర నెహ్రూ, గంటా చక్రరావు, వేముల శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11న కూడారై ఉత్సవం, అక్కారడిశెల్ పాయస నివేదన, 13న అమ్మవారి సారి ఊరేగింపు, వసంతోత్సవం, 14వ తేదీ రాత్రి 7 గంటలకు గోదా రంగనాథుల దివ్య కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కల్యాణోత్సవాన్ని భక్తులు తిలకించాలని కోరారు.
– తుని రూరల్


