తవ్వినకొద్దీ అక్రమాలు
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని వ్రత విభాగంలో తవ్వుతున్నకొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయి. ఒకవైపు ఓచర్లలో తన పేరు, అకౌంట్ మార్చి.. గుమస్తా, సూపరింటెండెంట్, ఏఈఓ సంతకాలతో పెద్ద మొత్తంలో సొమ్మును ఆ పురోహితుడు తన ఖాతాలో జమ చేయించుకున్న వైనం తాజా తనిఖీల్లో వెల్లడైనట్లు సమాచారం. మరోవైపు వ్రత పురోహితుడు అల్లంరాజు శ్రీనివాసశర్మ పేరిట ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆరా తీయగా.. ఆ లేఖ తాను రాయలేదని, అందులోని పేరు, సంతకం, ఫోన్ నంబర్ తనవి కావని అల్లంరాజు స్పష్టం చేశారు. దీంతో, ఈ లేఖ ఎవరు రాశారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.
సొంత ఖాతాలోకి పీఎఫ్ సొమ్ము!
వ్రత పురోహితుల పారితోషికం బిల్లుపై అధికారుల సంతకాల అనంతరం, కొంత మంది పేర్లు చేర్చి ఓ పురోహితుడు పెద్ద మొత్తంలో సొమ్ము స్వాహా చేసిన విషయం ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. 2024 మే నెల నుంచి గత ఏడాది సెప్టెంబర్ వరకూ తన వ్యక్తిగత, తన కుటుంబ సభ్యుల ఖాతాలకు రూ.28.54 లక్షలు మళ్లించాడు. దీనిపై వ్రత పురోహిత పెద్దలు, అధికారులు నిలదీయడంతో ఆ సొమ్మును అతడు తిరిగి వ్రత పురోహిత సంక్షేమ సంఘానికి జమ చేశాడు. ఆ మర్నాడే అనూహ్యంగా గుండెపోటుతో మృతి చెందాడు. అయితే, 2024కు ముందు కూడా అతడు ఇంకా ఏవైనా నిధులు దుర్వినియోగం చేశాడా అనే దానిపై లోతుగా తనిఖీలు చేయాలని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా వ్రత విభాగం నుంచి జరిగిన చెల్లింపులపై పరిశీలన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈపీఎఫ్ ఖాతాకు జమ చేయాల్సిన రూ.9 లక్షలను ఆ పురోహితుడు తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించిన విషయం తేలడంతో అటు దేవస్థానం అధికారులు, ఇటు వ్రత పురోహితులు ఆశ్చర్యపోతున్నారు.
అన్నవరం దేవస్థానంలో సుమారు 250 మంది వ్రత పురోహితులుండగా.. ఒక్కొక్కరి నుంచి పీఎఫ్‌కు రూ.1,750 కట్ చేస్తారు. ఆవిధంగా సుమారు రూ.4.50 లక్షలు, వ్రత పురోహితుల పారితోషికం నిధి నుంచి మరో రూ.4.50 లక్షలు కలిపి, సుమారు రూ.9 లక్షల వరకూ పీఎఫ్‌కు చెల్లిస్తున్నారు. అయితే, గత నవంబర్ నెలకు సంబంధించి ఈ మేరకు పీఎఫ్‌కు చెల్లించలేదని తనిఖీలో వెల్లడైంది. ఆ నెలలో అప్పటి ఈఓ వీర్ల సుబ్బారావు సంతకంతో ఆ పురోహితుడు రెండు చెక్కులకు సంబంధించిన సొమ్మును తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకుని, దానిని సొంత అవసరాలకు ఉపయోగించుకున్నట్లు గుర్తించారు. నవంబర్ 5న ఒక చెక్కు, 11వ తేదీతో మరో చెక్కు ఈవిధంగా ఆ పురోహితుడి ఖాతాలో జమ అయినట్లు సమాచారం. ఆ చెక్కులకు సంబంధించి ఓచర్లలో పీఎఫ్ అకౌంట్ నంబర్ ఉండాల్సిన చోట తన అకౌంట్ నంబర్ వేసి, ఆ పురోహితుడే సంబంధిత సిబ్బంది సంతకాలు చేసి ఉండవచ్చునని కూడా అంటున్నారు. ఈవిధంగా సుమారు మరో రూ.25 లక్షల వరకూ అవకతవకలు జరిగి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఇటువంటివి ఏమున్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు.
ఉన్నతాధికారులు సీరియస్
వ్రత విభాగంలో జరిగిన ఈ ఉదంతంపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పాలకొల్లులో జరిగిన సామూహిక వ్రతాల నిర్వహణలో దానాల పేరిట వ్రత పురోహితలు కానుకలు డిమాండ్ చేసిన ఉదంతం ఇటీవల వెలుగు చూసింది. అది జరిగిన కొద్ది రోజులకే ఈ అక్రమాలు బయటపడ్డాయి. ఈ వరుస ఘటనలను ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
‘పురోహితుని చేతివాటం’లో కొత్త కోణాలు
అతడి సొంత ఖాతాలోకి
రూ.9 లక్షల పీఎఫ్ సొమ్ము
అధికారుల తనిఖీలో వెల్లడి
మరో రూ.25 లక్షల వరకూ అవకతవకలు జరిగి ఉండవచ్చని అనుమానాలు
సీజేఐకి నకిలీ లేఖ?
వ్రత పురోహితుని చేతివాటం ఉదంతం నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి రాసినట్లుగా ఉన్న ఒక లేఖ శుక్రవారం ‘సాక్షి’ కార్యాలయానికి రిజిస్టర్ పోస్టులో వచ్చింది. దేవస్థానం వ్రత పురోహితుడు అల్లంరాజు శ్రీనివాసశర్మ పేరిట ఉన్న ఆ లేఖలో.. వ్రత పురోహితుడు స్వాహా చేసిన మొత్తం రూ.3 కోట్ల వరకూ ఉంటుందని, ఇందులో వ్రత విభాగం ఉద్యోగులతో పాటు దేవస్థానం ఉన్నతాధికారులు, 20 మంది వ్రత పురోహితుల పాత్ర ఉందని ఆరోపించారు. వ్రతాల ఆదాయంలో 40 శాతం పారితోషికాన్ని వ్రత పురోహితులకు ఇస్తున్నారని, దీనికి బదులు వ్రతాల ఆదాయం మొత్తాన్ని దేవస్థానం పూర్తిగా తీసుకుని, పురోహితులకు జీతాలిచ్చి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ఇటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదని తెలిపారు. ఈ లేఖ ప్రతులను ప్రధాని, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, దేవదాయ, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులకు, పలు పత్రికలకు పంపించినట్లుగా పేర్కొన్నారు. ఈ లేఖ మొత్తం లీగల్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి రాసినట్టుగా ఉంది.
అయితే, ఆ లేఖలో అల్లంరాజు శ్రీనివాసశర్మ పేరు, అడ్రస్ కింద ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేస్తే ‘మీరు డయల్ చేసిన నంబర్ పని చేయడం లేదు’ అనే సమాధానం వస్తోంది. ఈ లేఖ గురించి అల్లంరాజు శ్రీనివాసశర్మ వద్ద ప్రస్తావించగా.. తాను ఈ విషయమై ఎవరికీ ఎటువంటి ఫిర్యాదూ చేయలేదని బదులిచ్చారు. తన పూర్తి పేరు అల్లంరాజు సత్య శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ అని, ఆ లేఖలో ఉన్న సంతకం, ఫోన్ నంబర్ కూడా తనవి కావని తెలిపారు. మూడు రోజులుగా తాను స్థానికంగా లేనని, వారణాశి వెళ్లి, గురువారం అర్ధరాత్రి వచ్చానని చెప్పారు. ఈ నేపథ్యంలో తమలో గందరగోళం కలిగించడానికి ఎవరో కావాలనే ఫోర్జరీ సంతకంతో ఇటువంటి నకిలీ లేఖలు సృష్టిస్తున్నారని వ్రత పురోహితులు అంటున్నారు.
తవ్వినకొద్దీ అక్రమాలు


