అణచివేతపై పోరు
● సమస్యలపై గొంతెత్తితే రౌడీషీట్లా?
● ప్రభుత్వం తీరుపై మండిపాటు
● కాకినాడలో కదం తొక్కిన
యువత, విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలను అక్రమ పోలీసు కేసులతో వేధిస్తున్న ప్రభుత్వ తీరుపై యువత, విద్యార్థి లోకం మండిపడింది. ప్రభుత్వ దమన నీతిని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన కాకినాడలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ పిలుపు మేరకు జిల్లా నలుమూలల నుంచీ తరలి వచ్చిన యువజన, విద్యార్థి నేతలు, కార్యకర్తలు కాకినాడ ఇంద్రపాలెం అంబేడ్కర్ సెంటర్ వరకూ నిరసన ప్రదర్శన చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. వాటిపై అడుగుతున్న వివిధ పార్టీల నేతలు, ప్రజలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే విద్యార్థి, యువజన సంఘాల నేతలపై రౌడీషీట్లు తెరుస్తారా, ఉద్యమం అంటే ఎందుకంత భయం, యువత గొంతు నొక్కితే సహించం, కూటమి ప్రభుత్వ నిర్బంధ కాండను ఎండగట్టండి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం, అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించి, అక్కడ ఆందోళన నిర్వహించారు.
ప్రభుత్వ తీరును ఎండగట్టాలి
ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అనిల్ కుమార్ (బన్నీ), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విద్యార్థి విభాగం రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తోట రాంజీ మాట్లాడుతూ, హామీలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపడాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. 18 నెలల పాలనలో రూ.3 వేల కోట్ల నిరుద్యోగ భృతి ఎగ్గొట్టి, నిరుద్యోగులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆక్షేపించారు. ఉద్యోగాలివ్వకుండా, నిరుద్యోగ భృతి ఊసే ఎత్తకుండా ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను నిలువునా దగా చేసిందని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే విద్యార్థులు, యువత ఒకే వేదిక పైకి వచ్చి చంద్రబాబు సర్కార్‌కు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేసులు, నిర్బంధాలే అజెండాగా చంద్రబాబు పాలన సాగుతోందని దుయ్యబట్టారు. ప్రజా వ్యతిరేక పాలనను అడుగడుగునా విద్యార్థులు, యువజనులు ధైర్యంగా ఎదుర్కోవాలని, దీనికి పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని, పార్టీ శ్రేణులకు వెన్నంటి నిలుస్తామని అన్నారు. అనంతరం, కలెక్టరేట్ వరకూ పాదయాత్ర నిర్వహించి, పరిపాలనాధికారి రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మడదా హేమంత్, యువజన విభాగం నగర అధ్యక్షుడు రోకళ్ల సత్య, ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, తుని నియోజకవర్గాల యువజన విభాగాల అధ్యక్షులు సగరు గుర్రాజు, దాసం వెంకటేష్, వీరంరెడ్డి నాని, ఎన్.చక్రవర్తి, మాదేపల్లి రాజబాబు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పూసల అనిల్ కుమార్, కాకినాడ నగర, రూరల్ విద్యార్థి విభాగాల అధ్యక్షులు జలగడుగుల పృథ్వీ రాజేష్, గౌతం తేజ, ఏఐవైఎఫ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎలుబండి బాబీ, బొండాడ దీపక్ తదితరులు పాల్గొన్నారు.


