పిఠాపురంలో దళిత నాయకుల అరెస్ట్
పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో పిఠాపురానికి చెందిన వైఎస్సార్ సీపీ దళిత నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పిఠాపురానికి చెందిన దళిత నాయకుడు లోడ అప్పలరాజును తుని పోలీసు స్టేషన్లో, చందక శ్యామలరావును కాకినాడ పోలీసు స్టేషన్లో, వజ్రపు బాబీ, వజ్రపు వీరేష్, బోను దేవ, బత్తిన రాజశేఖర్‌లను గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లలో శుక్రవారం ఉదయం నుంచి ఉంచారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వీరిని వైఎస్సార్ సీపీ నాయకులు గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, మొగలి అయ్యారావు, లలిత, గండ్రేటి శ్రీరామచంద్ర మూర్తి తదితరులు పరామర్శించి, అక్రమ అరెస్టులను ఖండించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ దళితులకు సంక్రాంతి సంబరాలు చేసుకునే అవకాశం ఇవ్వరా అంటూ ప్రశ్నించారు.


